విమోచనోత్సవాలను ఎందుకు విస్మరిస్తున్నారు: బిజెపి
ఆదిలాబాద్,ఆగస్ట్30: తెలంగాణ విమోచనోత్సవాన్ని నిర్వహించడంలో సిఎం కెసిఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు తెలియచేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు. తెలంగాణ రాకముందు ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడుతున్న కెసిఆర్‌కు ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. బిజెపి ఆధ్వర్యంలో విమోచనోత్సవాన్ని తామే నిర్వహిస్తామని అన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
సెప్టెంబరు 1 నుంచి ‘తెలంగాణ విమోచన యాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అడ్డుకునే ప్రయత్నాలు చేసి తెలంగాణ వ్యతిరేక్తను ప్రదర్శించరాదని అన్నారు. విమోచనోత్సవం సందర్బంగా సెప్టెంబరు 17న భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, దీనికి కేంద్ర¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపనందుకు ఆందోళన చేసిన సిఎం కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయ్యాక కూడా విస్మరించడం తగదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటల గారడితో తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. విచ్చలవిడి ప్రకటనలతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, స్వాగతం పలికేందుకు ఆర్భాటాలు చేసి ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తాని చెప్పారని, ఎస్పీఎం మూతపడ్డా పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణకు పునర్ వైభవం తెస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వం తెలంగాణాలో చేపడుతున్న ప్రాజెక్టులపై డీపీఆర్‌ను విడుదల చేయాలని డిమాండు చేశారు. ఏ రకంగా లాభమో చెప్పడం లేదని, ఒప్పందాలను తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు.