వివరణకూ ‘మసి’ !

దేశ ప్రతిష్టను పాతాళానికి దిగజార్జింది బొగ్గు కుంభకోణం. ఎందుకంటే, ఆ శాఖ ఉన్నది సాక్షాత్‌ భారత దేశ ప్రధాని చేతిలో కాబట్టి. గత కుంభకోణాలను తలదన్నేలా కొత్తగా దేశంలో వెలుగు లోకి వస్తున్న కుంభకోణాలు ప్రపంచ పటంపై మన దేశ సార్వభౌమత్వంపై మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి. ఎన్డీఏ హయాంలో, యూపీఏ-1 కాలంలో జరిగిన అవినీతి కన్నా యూపీఏ-2లో కుంభకోణాల రూపంలో యథేచ్ఛగా జరుగుతున్న అవినీతి సాగు మూడు పూవులు ఆరు కాయలుగా భాసిల్లుతున్నది ! లక్షా 70 వేల కోట్ల 2జీ స్కాం కంపును సగటు భారతీయుడి ముక్కు పుటాలను దాటక ముందే ఏకంగా ప్రధానమంత్రి పర్యవేక్షణలో నడుస్తున్న బొగ్గు మంత్రిత్వ శాఖలో జరిగిన గని కేటాయింపుల్లో 2జీని స్కాంకు రెట్టింపు డబ్బు చేతులు మారిందని తెలిసి కంగుతిన్నాడు. దేశ ప్రతిష్టకు అంటుకున్న ఈ ‘బొగ్గు మసి’పై, ఆ శాఖ మంత్రిగా వివరణ ఇవ్వాలని ప్రస్తుతం జరుగుతున్న వర్గాకాల సమావేశాలు మొదలైన వారం నుంచి ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా కూడా ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని అనిపించలేదు. పైగా, ఎదురు దాడికి దిగారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఇప్పటి వరకు ‘క్లీన్‌ క్యారెక్టర్డ్‌ మ్యాన్‌’గా పేరు తెచ్చుకున్న ప్రధానమంత్రి కూడా తాను రాజకీయాలకు అతీతమేమీ కాదని కుక్కిన పేనులా ఉండిపోయారు. ప్రతిపక్షాలు బొగ్గు స్కాంకు బాధ్యత వహిస్తూ, ఆ శాఖను చూస్తున్న ప్రధాని రాజీనామా చేయాలని సభను స్తంభింప చేస్తూ రావడంతో ఎట్టకేలకు మౌన ముని మన్మోహనుడు నోరు విప్పాడు. వివరణ ఇవ్వడానికి పూనుకున్నాడు. ఇచ్చిన వివరణ కూడా ఏ వర్గాలనూ సంతృప్తి పర్చలేదు. గత ప్రభుత్వ విధానాలనే తామూ అనుసరించామని, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు చేశామని చెప్పుకొచ్చి తప్పించుకోవాలని చూశాడు. అంటే, గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనూ తప్పులు జరిగాయి.. మేము చేస్తే తప్పా అన్నట్లు బీరాలు పలికాడు. కానీ, ఇక్కడ ఈ ‘క్లీన్‌ ఇమేజ్‌’ ఉన్న మనిషి ఒక్క విషయాన్ని మరిచాడు. గత ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపి, సింగ్‌ సాబ్‌ నేతృత్వం వహిస్తున్న యూపీఏకు పాలన పగ్గాలు అప్పజెప్పింది గతం పునారావృతం కావద్దని. అలాంటి తప్పులే చేసి వివరణ ఇవ్వాలని కాదు. దేశ ప్రధాని అత్యున్నత చట్ట సభలో ఇచ్చిన వివరణ చూస్తుంటే ‘పిల్లాడిని నువ్వెందుకు ఫెయిలయ్యావురా’ అంటే ‘నేనొక్కన్నే ఫెయిలయ్యానా.. ఆ మల్లయ్య, ఈ పోచయ్య, పోషయ్య, ఎల్లయ్యలందరూ ఫెయిలయ్యారు.. నేను కూడా ఫెయిలయ్యాను’ అని చెప్పినట్లుంది. ఫెడరల్‌ వ్యవస్థలో ఉండడం వల్లనే చట్టాల సవరణలో జాప్యం జరిగిందని, అదే బొగ్గు మసి అంటుకోవడానికి కారణమని ప్రధాని తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇదే నిజమైతే చట్టాలను సవరించే వరకైనా బొగ్గు గనుల కాంట్రాక్టులను రద్దు చేయాల్సింది కదా ! కానీ, అలా చేయలేదు. ఈ లెక్కన ఓ భారీ కుంభకోణం జరిగే అవకాశాలున్నాయని మన్మోహన్‌జీకి ముందే తెలిసి ఉంటుంది కదా ! అప్పటి ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌, రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే పాత ‘బొగ్గు’ విధానాన్నే కొనసాగించాలని ఉత్తరాలు రాశారని, అందుకే తామూ అవే పాత విధానాలను కొనసాగించామని అమాయకత్వం ఒలకబోశారు. మరీ ఏది పండో ఏది కాయో తెలియని వ్యక్తి దేశ అత్యున్నత పదవికి తగడన్న విషయం మన్మోహన్‌కు తెలిసి ఉంటుంది కదా ! ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని మరిచి, ‘వారు చెప్పారు కాబట్టి చేశాం’ అని ఏకంగా ప్రధాని అనడం ముమ్మాటికీ నిర్లక్ష్యమే. బొగ్గు స్కాం జరిగిందన్న విషయం బయటకు పొక్కాక దేశ ప్రతిష్ట సగం దిగజారితే.. ఈ స్కాం విషయంలో ప్రధాని ఇచ్చిన వివరణ చూశాక మొత్తం ప్రతిష్ట కొట్టుకుపోయిందని భావించాలి. ఇప్పటికైనా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలంటే ఈ అతిపెద్ద, భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలి. కాంట్రాక్టులను రద్దు చేయాలి. కుంభకోణానికి కారణమైన పార్టీల నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలి.+