వివేకా హత్యలో… ఇంటి దొంగల ప్రమేయం!

– వందరోజుల పాలనలో కేసును చేధించలేకపోయారు
అమరావతి, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  వంద రోజుల పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ తన సొంత బాబాయి హత్య కేసును ఛేదించలేకపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకా హత్య జరిగిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసు దర్యాప్తును వేగవంతం చేసిందన్నారు. ఆ తరువాత కోర్టుకెళ్లడంతో ఎన్నికల సమయంలో వివేకా హత్య విషయాన్ని ప్రస్తావించకూడదని కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. కోర్టులను గౌరవించి ఆ విషయంపై ఎవరూ మాట్లాడలేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి వంద రోజులు అవుతున్నా బాబాయి హత్య కేసును పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానితులుగా ఉన్న వాళ్లను చనిపోయేలా చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. పరిటాల హత్య కేసులో నిందితులు వాళ్లకు వాళ్లే చంపుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం చూశామన్నారు. ఇప్పడు కూడా అలాగే జరుగుతోందన్నారు. వివేకా హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు మొద్దు శ్రీను.. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అంటూ బుద్దా సంచలన వ్యాఖ్యలు
నిజానికి వివేకా హత్య కేసులో అనుమానితులుగా చెబుతున్న వాళ్లందరూ సీఎం వైఎస్‌ జగన్‌కు సన్నిహితులేనని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటూ పాత సామెతను గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో ఇంటి దొంగల ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందువల్లనే అనుమానితులను చనిపోయేట్లుగా చేస్తున్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.