విశాఖలో మరో ఓడరేవు!
– రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పోర్టు ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక
హైదరాబాద్, విశాఖపట్నం, జూన్ 27 : ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతిపెద్ద ఓడ రేవు ఏర్పాటు కోసం విశాఖ జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో రామాయపట్నాన్ని నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఓడరేవు నెలకొల్పే ప్రాంతాన్ని ఖరారు చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రూ. 5,000 కోట్ల వ్యయంతో దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఓడరేవు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం ఆసక్తి చూపింది. ఆ క్రమంలో ఓడరేవు ఏర్పాటుకు రాష్ట్రంలో విశాఖపట్టణంలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం, నెల్లూరు జిల్లాలో దుర్గరాజపట్నాన్ని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ మూడు ప్రాంతాలపై సమగ్ర అధ్యయనం జరిపింది. ఓడరేవు ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా నక్కపల్లి, రామాయపట్నం వైపు కమిటీ మొగ్గు చూపింది. పలు కారణాలతో గురురాజపట్నాన్ని కమిటీ తిరస్కరించింది. స్థలాన్ని ఖరారు చేసి, కేబినెట్‌లో సంప్రదించి దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రికి సదురు ప్రతిపాదన పంపించేందుకు గాను మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, పరిశ్రమలు, ఆర్థికం, తదితర శాఖలు ప్రాథమిక సమావేశం నిర్వహించాయి. అధికార వర్గాలు చెప్పిన దాన్ని బట్టి నక్కలపల్లిలో ఓడరేవు ఏర్పాటుకు అవకాశాఇలు మెండుగా ఉన్నాయి. అదే జరిగిన పక్షంలో విశాఖపట్టణం, గంగరేవు ఓడరేవులతో కలుపుకొని మూడు ఓడరేవులను కలిగిన జిల్లాగా విశాఖపట్టణం జిల్లా వినుతికెక్కుతుంది.