విశాఖలో విద్యాశాఖ ఆర్జెడి కార్యాలయం
ఒత్తిడి తగ్గించేందుకే అని వెల్లడి
విశాఖపట్నం,జూన్11(జనం సాక్షి): విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని (ఆర్‌జేడీ) కార్యాయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విద్యా సంబంధిత పనుల కోసం కాకినాడ ఆర్‌జేడీ కార్యాలయానికి వెళ్లాల్సిరావడం ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనలతో విశాఖలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. విద్యా ప్రమాణాల విషయంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రంలో 17వ స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకోవడంపై అధికారుల కృషిని అభినందించారు. ఈ ఏడాది పూర్తిగా నాణ్యమైన విద్యను అందించడంపైనే దృష్టి సారించాలని డీఈఓలను ఆదేశించారు. ఇదిలావుంటే సర్వశిక్ష అభియాన్‌లో (ఎస్‌ఎస్‌ఏ) పోస్టుల భర్తీ పక్రియ ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకు పైగా వివిధ పోస్టులను పొరుగు సేవల ద్వారా నియమించడానికి ఇప్పటికే ఏజెన్సీలను ఎంపిక చేసారు. పూర్తి పారదర్శక పద్ధతిలోనే చేపడతామని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌పీడీ) శ్రీనివాసరావు అన్నారు. అవుట్ సోర్సింగ్ ఎస్‌ఎస్‌ఏ పోస్టుల భర్తీ ద్వారా కొంత భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే జిల్లా కమిటీలో జిల్లా విద్యాశాఖాధికారి, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్, సంయుక్త కలెక్టర్ జిల్లా కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి గుర్తించి అధికారికంగా నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన తరవాతే జిల్లా కమిటీ ద్వారా ఎంపికలు జరుగుతాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఈ పోస్టులను పొరుగు సేవల సంస్థలు అమ్మకాలకు పెడుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై విచారణలు జరిపిస్తామన్నారు. అభ్యర్థులెవరూ ఈ పోస్టుల కోసం ఏజెన్సీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున జిల్లా కమిటీ చెంతకు పంపిస్తామని వారిలో ఒకరిని ఎంపిక చేస్తారని వారిని పొరుగుసేవల ద్వారా నియమించుకుంటామని చెప్పారు. ఎక్కడైనా ఏజెన్సీలు డబ్బులు వసూళ్లు చేసినట్లు తేలితే ఆ సంస్థలను తొలగించి కొత్త సంస్థల ద్వారా నియామకాలు చేపడతామని చెప్పారు. దీనిపై అభ్యర్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత డీఈవో, పీఓలపైనే ఉందన్నారు. ఈ ఏడాది కొత్తగా 220 ఉర్ధూ పాఠశాలలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలగా ఉన్నతి కల్పించినట్లు చెప్పారు. దీనివల్ల 660 ఉపాధ్యాయ పోస్టులు కొత్తగా నియమించుకునే అవకాశం రావడంతో పాటు 20 వేల మంది విద్యార్థులకు మేలు కలుగుతుందన్నారు.