విశ్వనగరంగా హైదరాబాద్
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబర్ 19(జనంసాక్షి): విశ్వనగరంగా హైదరాబాద్ విరాజిల్లు తుందని, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటి రామారావు అన్నారు. శనివారం మంత్రి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 77 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిసి కెమరాల ఏర్పాటుతో మంచి ఫలితాలు వస్తున్నాయని, నేరాలను త్వరగా గురు/-తించే వీలు కలుగుతోందని అన్నారు.హైదరాబాద్ నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్దికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రధానంగా కరెంట్, మంచయినీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని కొందరు అపోహలు సృష్టించారని విమర్శించారు. అలాంటి వారు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. స్వరాష్ట్రంలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని వివరించారు. విశ్వనగర్ విజన్‌తో ముందుకెళ్తున్నామని అన్నారు. మెట్రోను నగర శివార్ల వరకు విస్తరిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రజల దాహం తీరుస్తామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిపై గత పాలకులు సోయే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. నగర ప్రజల తాగునీటి కోసం 30 టీఎంసీల సామర్థ్యం గల 2 రిజర్వాయర్లను నిర్మిస్తున్నామన్నారు. నగర ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కోటి మంది జనాలు నివసిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విశ్వమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విశ్వనగరంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో 36 మోడల్ మార్కెట్లను నిర్మించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. మణికొండ గౌతమి ఎన్‌క్లేవ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సేవ్ అండ్ స్మార్ట్ కాలనీలో భాగంగా 25 సీసీ కేమెరాలను ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధికి మంత్రి రూ.ఐదు లక్షలు ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ఇలాంటి కాలనీల పాత్ర కీలకమన్నారు. హైదరాబాద్‌ను స్మార్ట్ నగరంగా గూగుల్ సీఈవో అభివర్ణించిన విషయం గుర్తు చేశారు.