విస్తరిస్తున్న ఒమిక్రాన్‌


` భారత్‌లో కొత్తగా మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు
` అప్రమత్తంగా ఉండాలి
` కేంద్రం హెచ్చరిక
ముంబయి,డిసెంబరు 6(జనంసాక్షి):కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో మరో రెండు కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది కేసులు వెలుగుచూడగా.. ముంబయి మహా నగరంలో తాజాగా నమోదైన ఈ రెండు కేసులతో ఆ సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి ముంబయికి వచ్చిన మరో వ్యక్తి (36)లో ఒమిక్రాన్‌ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది. మరోవైపు, ఆదివారం (నిన్న) ఒక్కరోజే దేశంలో 17 కేసులు (రాజస్థాన్‌లో తొమ్మిది, మహారాష్ట్రలో ఏడుగురు, దిల్లీలో ఒకరు) వెలుగుచూశాయి. వీరిలో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు లేదా అలాంటివారికి సన్నిహితంగా మెలిగినవారే కావడం గమనార్హం. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 10 (కల్యాణ్‌ 1, పుణె 1, పింప్రీ`చించ్వాడ్‌లో 6, ముంబయి 2) కేసులు నమోదు కాగా.. రాజస్థాన్‌లో 9, కర్ణాటక 2, దిల్లీ 1, గుజరాత్‌లో 1 చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.