విస్తరిస్తున్న డెంగ్యూ జ్వరాలు

జ్వరపీడితులతో జిల్లావాసుల ఆందోళన
జగిత్యాల,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో ఎక్కడ చూసినా  డెంగ్యూ జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు డెంగ్యూ జ్వరం బారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది.జ్వరం తగ్గకపోగా, ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు వారం, పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ వ్యాధి బారిన పడి 8 మంది మృత్యువాత పడగా, మరొకరు విష జ్వరం తో మరణించారు.  ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది గ్రావిూణ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గకపోవడంతో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల సూచనల మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. జ్వరం బారిన పడినవారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ బయటకు రాలేదు. వందల సంఖ్యలో ప్రజలు జ్వరం బారినపడి ఇప్పటికీ చికిత్సలు పొందుతూనే ఉన్నా రు. ఏ గ్రామంలో చూసినా ఇంటికి ఒకరిద్దరు జ్వరంతో చికిత్సలు పొందుతున్నవారే కనిపిస్తున్నారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో ఒక్కరు కూడా చనిపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. జగిత్యాల జిల్లాలో 72 మంది డెంగ్యూ బారిన పడినట్లు గుర్తించడం జరిగిందని, వారంతా చికిత్సలు పొందారని, ఒకరు కూడా చనిపోలేదని ప్రభుత్వానికి నివేదికలు పంపడం చూస్తుంటే ఆశ్చ ర్యం కలిగిస్తోంది. జగిత్యాల జిల్లాలో రోజురోజుకు జ్వర పీడితుల సంఖ్య పెరుగడానికి పరిశుభ్రత లోపమే కారణమనే విమర్శలు వినిపిస్తు న్నాయి. పట్టణ ప్రాంతా ల్లో ఎక్కువగా జ్వర పీడితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ జ్వర పీడితులతోనే నిండిపోయాయి. పరిశుభ్రత లోపించడంతో పాటు, దోమలు పెరుగడంతోనే ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల బల్దియాలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం ఫాగింగ్‌ కూడా చేయడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మురికి కాలువలు పేరుకుపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు, నాయకులు చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిశుభత్ర మెరుగుపరిచి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.