విూడియాలో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం
పోలీసులు సెర్చ్ వారెంట్ ఇచ్చే సోదాలు చేశారు
పోలీసుల నుంచి డబ్బు లాక్కెళ్లిన వారిపై కేసులు
వివరాలు వెల్లడించిన కమిషనర్ జోయల్
సిద్దిపేట,అక్టోబర్27(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసులపై విూడిచా ఛానెల్స్, సోషల్ విూడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని సిద్దిపేట సీపీ జోయల్ డేవీస్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ మంగళవారం ఉదయం విూడియా సమావేశం నిర్వహించారు. ముందస్తు సమాచారంతోనే సోమవారం సోదాలు నిర్వహించామన్నారు. ఎగ్జిక్యూటివ్ అధికారి సర్చ్ వారెంట్ ఇచ్చాకే సోదాలు చేశామన్నారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా తయారు చేశారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్టేట్ర్ బయటకు వచ్చే సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. తమ సిబ్బందే డబ్బు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఉండటం వల్లే నగదు లాక్కెళ్తున్నా అడ్డుకోలేకపోయామని సీపీ తెలిపారు. సోమవారం నాటి ఘటనలో ఐదుగురిని గుర్తించి, మరో 20 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఘటనంతా సురభి అంజన్ రావు ఇంట్లోనే జరిగిందని సీపీ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్టేట్ర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. డబ్బు దొరికిన ఇంటి యజమానితో పాటు పంపించిన వ్యక్తి సంతకాలు తీసుకున్నారు. సీజ్ చేసిన నగదును లాక్కెళ్లడం పెద్ద నేరమని సీపీ తెలిపారు. సురభి అంజన్ రావు నివాసంలోనే నగదు దొరికిందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేస్తే ఒకరి వద్దే డబ్బు దొరికిందని తెలిపారు. ఎన్నికల సంఘం పరిధిలోనే తాము పని చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని బండి సంజయ్‌కు ముందస్తుగానే సమాచారం ఇచ్చామని చెప్పారు. సిద్దిపేటకు రావొద్దని ముందుగానే ఫోన్ చేసి కోరానని సీపీ తెలిపారు. బండి సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. దుబ్బాక ప్రచారానికి వచ్చే ఎవరిని అడ్డుకోవట్లేదు అని తెలిపారు. అయితే ప్రణాళిక ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. సిబ్బంది పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహిస్తు న్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని సీపీ కోరారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నామని.. నిన్న ఏం జరిగింది అనేది ఎన్నికల కమిషన్‌కి…డిజీపీకి నివేదిక పంపించానన్నారు. వీడియో ఆధారాలు సేకరించి రిమాండ్ తరలిస్తామని పేర్కొన్నారు. నా పై ఫిర్యాదు చేసినా… ఎన్నికల కమిషన్ ఏం జరిగింది అనే నివేదిక అడుగుతారు కదా అని పేర్కొన్నారు. ఏ పార్టీ ఫిర్యాదు చేసినా తనిఖీలు చేశామని.. పోలీసుల విూద నమ్మకం లేకపోతే…జిల్లా కలెక్టర్..ఎన్నికల పరిశీలకులకు కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. తాము ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నామని వెల్లడించారు. మాపై ఫిర్యాదు చేసిన వాళ్ళ తనిఖీల్లో చాలా చోట్ల డబ్బులు దొరకలేదన్నారు.


