వీఆర్ఏ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

పే స్కేల్ జీవో ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి – ఎండీ.అజీజ్ పాషా
హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): వీఆర్ఏ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మీరు అసెంబ్లీలో వీఆర్ఏ లకు ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు దాటినా విఆర్ఎల సమస్యలు పరిష్కరించ లేదన్నారు. వీఆర్ఏలు సుదీర్ఘంగా 69 రోజులుగా సమ్మె కాలంలో ఉండటంతో వీరికి జీతాలు రాక, ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంట్లో నిత్యావసర సరుకులు కొనుగోలు
చేసేందుకు ఆర్థికంగా లేకపోవటం వేతనాలు రాక వారి కుటుంబ పోషణ కష్టమౌతూ ఆర్థిక భారంతో వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను అమలు పరిచే విషయం లో వీఆర్ఏల పాత్ర కీలకమన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవుట్సోర్సింగ్ అనే పదం ఉండదు అని చెప్పి అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాo అంటూ హామీలు ఇచ్చి నేడు ఉన్న
ఉద్యోగాలకు కూడా రక్షణ లేని పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. తహసీల్దార్లు ఇప్పటికే ఉన్న పని భారంతో ఇబ్బందులు పడుతున్న వీరి సమ్మె వలన రెవెన్యూ శాఖలో
సంబంధించిన పనులు పూర్తి కాక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీల్లో వీఆర్ఏలు సమ్మెలో వుండటం వలన పరిపాలన కుంటుపడిందని
అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఆర్ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందన్నారు.
తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైన పేర్కొన్న వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముశం సత్యనారాయణ, హుజూర్ నగర్ మండల వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పి వీరబాబు, కార్యదర్శి అన్నపూర్ణ, రాష్ట్ర కోకన్వీనర్ నరసింహారావు, శ్రీనివాస్, రాంబాబు, సతీష్, సంధ్య, నాగమ్మ, రంజాన్, ఖాసీం, ఇబ్రహీం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.