వీడని అసంతృప్తి జ్వాలలు
చాలాచోట్ల నేతల బహిరంగ ప్రకటనలు
సమాచారం తెప్పించుకుంటున్న కెసిఆర్
హైదరాబాద్,అక్టోబర్1(జనంసాక్షి): ముందస్తు ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల జాబితా ప్రకటించి మార్పు లేదంటూ సిఎం కెసిఆర్ ప్రకటించినా అనపేక చోట్ల అసంతృప్తి రగులుతూనే ఉంది. అసమ్మతి నేతలు గళం విప్పుతూనే ఉన్నారు. కొందరు పార్టీని వీడుతున్నారు. మరికొందరు పోటీగా నామినేషన్లు వేసి బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల గెలుపు ఓటములపై జరుగుతున్న సర్వేలు హడలెత్తిస్తున్నాయి. సొంత పార్టీల సర్వేలు ఒకవైపు.. ఇతర సంస్థల సర్వేలు మరోవైపు అభ్యర్థులను బేజారెత్తిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం నాయకుల ఎవరూ బహిరంగంగా ముందుకు రావడం లేదు. వీటన్నింటిపై సమగ్రంగా నివేదికలు తెప్పించుకున్న సిఎం కేసీఆర్ ఎక్కడెక్కడ అసంతృప్తు లున్నారు..? వారి వెనుక వ్యక్తులు ఎవరు..? ఆ నియోజకవర్గంలో ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తుల ప్రభావం ఎంత..? అనే కోణంలో ఆరా తీస్తుండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీంతో వారి కదలికలపై నిఘా పెట్టారు. ముందుగా బుజ్జగించాలని, వినకుంటే కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ప్రకటించిన సిట్టింగ్ అభ్యర్థుల స్థానాల్లో వారు నిర్వహిస్తున్న పార్టీ కార్యకలాపాలు, ప్రచారం, సమావేశాలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదికలు ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తెలిసింది. నివేదికల ఆధారంగా రెబల్స్ ప్రభావం ఎంత ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఈ రకంగా జిల్లాల్లో సిట్టింగ్‌ల పనితీరుపై పరిశీలన జరుపుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పరిస్థితులనూ అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఓ వైపు అభ్యర్థుల గెలుపు ఓటములు, అనుకూల, ప్రతికూల పరిస్థితులు సొంత పార్టీ నుంచి సర్వేలు చేయిస్తున్న కేసీఆర్ తాజా పరిస్థితులను బేరీజు వేస్తున్టన్లు సమాచారం. వీటితోపాటు చాపకింది నీరులా అసంతృప్తి ఉన్న పలు నియోజకవర్గాల్లోనూ నిఘావర్గాలు పర్యటించడం, పలువురిని కలిసి అభిప్రాయాలను సేకరించడం చర్చనీయాంశం అవుతోంది. అసంతృప్త నేతలపై పకడ్బందీ నిఘా వేసి వారి పర్యటనలు ఎలా సాగుతున్నవి ఆరా తీయడంతోపాటు, ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్‌లు, అభ్యర్థుల పనితీరుపై నిఘావర్గాలు పరిశీలన జరుపుతున్నాయి. అసమ్మతి రోజురోజుకూ పెరుగుతుండగా, కొన్నిచోట్ల ప్రకటిత అభ్యర్థుల అభ్యర్థిత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల తగ్గినట్లు కనిపించినా మిగతా ముఖ్య నేతలు కూడా నిరసన గళం వినిపిస్తున్నారు.