వీడిన ఎఫ్‌డీఐ పీటముడి
ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టుకేలకు వీగిపోయింది. ఉభయసభలలోనూ చర్చకు ఆయా సభల ఆధ్యక్షులు పచ్చజెండా ఊపారు. లోక్‌సభలో వచ్చేనెల 4,5 తేదీల్లో చర్చ జరగనుండగా రాజ్యసభలో తీదీలు ఇంకా నిర్ణయించాల్సిఉంది. ఈనెల 22న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైననాటి నుంచి ఈ అంశంపై ఓటింగుతో కూడిన చర్చ జరగాల్సిందేనంటూ వామపక్షాలు, మిగిలిన ప్రతిపక్షాలు పట్టుపట్టుకుని కూర్చున్నాయి. దీంతో పార్లమెంటులో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. చర్చను నివారించడానికి ప్రభుత్వం తీవ్రప్రయత్నాలు చేసింది. అఖిలపక్ష సమావేశం, యూపీఏ పార్టీలతో భేటీ నిర్వహించింది. బుధవారం కూడా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి మల్‌నాథ్ ఉభయసభలలో ప్రతిపక్షనాయకులు సుష్మారాజ్, అరుణ్‌జైట్లీలతో కూడా చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయింది. బీజేపీ తన పట్టును వీడకపోవడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని సభల ప్రైసెడింగ్ వదిలింది. ఉభయసభల అధ్యక్షులూ చర్చకు అనుమతి ఇచ్చారు. లోక్‌సభలో 184వ నిబంధన కింద రాజ్యసభలో 167,168 నిబంధనల కింద చర్చ జరుగుతుంది. ఎఫ్‌డీఐ అంశంమీద చర్చ కోసం తనకు 30 నోటీసులు అందాయని, చర్చకు అవకాశమిచ్చే తీర్మాణాన్ని అనుమతించారని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. చర్చ జరిగే తీదీని తర్వాత నిర్ణయిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రాజీవ్ శుక్లా చెప్పారు. ఎఫ్‌డీఐ అంశంలో ప్రభుత్వానికి మద్దతిస్తామని డీఎంకే రెండురోజుల క్రితం ప్రకటించడంతో లోక్‌సభలో సర్కారుకు మెజార్టీకి ఢోకాలేదు. అయితే తగినంత సంఖ్యాబలంలేని రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు. దానికితోడు రాజ్యసభలో ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది.