వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్షకు నో

పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి
ఏ క్షణాన్నైన ఉరి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) :
పోలీసుల వాహనం పేల్చివేత కేసులో నిందితులు వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ బుధవారం తిరస్కరించారు. దీంతో వీరికి ఏ క్షణాన్నైనా ఉరిశిక్ష అమలు జరిపే అవకాశాలున్నాయి. 1993లో వీరప్పన్‌ అనుచరులు కర్ణాటకలోని పాలేరు సమీపంలో పోలీసు వాహనం లక్ష్యంగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో 22 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ ఘటనకు 13 మంది వీరప్పన్‌ అనుచరులు బాధ్యులని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రాసిక్యూషన్‌ వీరికి వ్యతిరేకంగా సాక్షాలు చూపడంతో మైసూర్‌ టాడా కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై రాష్ట్ర హైకోర్టులో అప్పీల్‌ చేయగా వారికి చుక్కెదురైంది. 2004లో కింది కోర్టు తీర్పును సుప్రీం నిర్ధారించింది. అప్పటి నుంచి వీరు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఎట్టకేలకు రాష్ట్రపతి పిటిషన్‌ కొట్టివేయడంతో వీరికి త్వరలో శిక్ష అమలు చేయనున్నారు. కాగా రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగో క్షమాభిక్ష పిటిషన్‌ను రద్దు చేశారు.