* వీరయోధులందరినీ తలుచుకోవడం మన కర్తవ్యం …. కర్ణ అనూష శరత్ రెడ్డి

కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకోవాలి…. రవీందర్ రెడ్డి
నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి,సెప్టెంబర్17;తెలంగాణ రాష్ట్ర ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ కర్ణ అనూష శరత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల వేడుక‌ల్లో నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆమె తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి తదనంతరం జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింద‌ని తెలిపారు.
నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి,అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందామన్నారు. భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకోవాలని తెలిపారు.తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు,మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దామన్నారు.
ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ పట్టణ ప్రధాన కార్యదర్శి భూష రాజుల కృష్ణయ్య మాట్లాడుతూ రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు.
భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం అన్నారు.
ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా,ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నామని,దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామ‌ని తెలిపారు. నందికొండ మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ మాట్లాడుతూ
నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య,సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని,ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్లు,పలువురు టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.