వీరోచిత ధైర్యసాహసాలు ప్రదర్శించినవారు బాల్ పురస్కార్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి:అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి): వీరోచిత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారితో పాటు ఆవిష్కరణలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి , సామాజిక సేవా రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులు అందజేయుటకు కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలలో దాగిఉన్న సృజనాత్మకత, ధైర్యసాహాసాలను గుర్తించి అవార్డుల ప్రధానం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం ఉన్న పిల్లలలో ఈ స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ప్రతి ఏటా పిల్లలకు బాల పురస్కార్ అవార్డులను అందజేస్తున్నదని ఆమె తెలిపారు. అర్హత ఉన్నట్లు భావించిన జిల్లాకు చెందిన పిల్లలు ఈ నెల 31 లోగా కొత్తగా రూపొందించిన ఏకీకృత జాతీయ అవార్డుల పోర్టల్ https://awards.gov.in/ లో అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అట్టి దరఖాస్తులో పేర్కొన్న విజయాలు, అంశాలు సరైనవేనా అని కేంద్ర ప్రభుత్వం తిరిగి జిల్లా కలెక్టర్ లకు పరిశీలన నిమిత్తం నవంబర్ మొదటి వారంలో పంపుతుందని ఆమె తెలిపారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పక్షం రోజులలోగా దరఖాస్తులపై పరిశీలన జరిపి తిరిగి కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపుతారని ఆమె పేర్కొన్నారు. ఎంపికైన పిల్లలకు డిసెంబర్ 26 న వీర్ బాల దివస్ సందర్భంగా అవార్డులు ప్రధానం చేస్తారని ప్రతిమ సింగ్ తెలిపారు.
Attachments area