వెంకటగిరి ఆస్పత్రిలో సమస్యల తిష్ట

సిబ్బంది కొరతతో సకాలంలో అందని వైద్యం
నెల్లూరు,నవంబర్‌8 (జనం సాక్షి) :  వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలు, ప్రతిభావంతులైన వైద్యులు ఉన్నా, సిబ్బంది కొరతతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడంలేదు. ఇక్కడ శస్త్రచికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిన పాలకులు, అందుకు అవసరమైన సిబ్బందిని నియమించలేదు. ఆసుపత్రిలో నెలకు 30కి పైబడి కాన్పులు చేయాలన్నది లక్ష్యం, కానీ డాక్టర్ల కొరత కారణంగా డెలివరీ కేసులను గూడూరుకు రెఫర్‌ చేస్తున్నారు. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వచ్చిన వారు ఊబకాయంతో ఉంటే సమస్యలు తలెత్తుతాయన్న భయంతో వారిని గూడూరుకు పంపుతున్నారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజుకు ఓపీ 300లకుపైగా చేరుకొంది, దీంతో ల్యాబ్‌లో ఉన్న టెక్నీషియన్‌ సకాలంలో పరీక్షలు నిర్వహించలేక పోతున్నారు. అదనంగా మరో టెక్నీషియన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న రెండు డాక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తే ఇన్‌పేషంట్‌లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ను నియమించి టెలిరేడియాలసిస్‌ సౌకర్యం ఏర్పాటు చేసినటళల్తేయితే ఎంఎల్‌సీ కేసులకు చికిత్స అందించే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ టెస్ట్‌ల వద్ద కౌన్సెలింగ్‌ చేసే వ్యక్తి లేక పోవడం వల్లనూ, టెస్ట్‌ రిపోర్టులు సకాలంలో ఇవ్వలేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న లెప్రసీ ఆసుపత్రి భవనంలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుతో సహా సుమారు రూ 12 లక్షలు ఖర్చు చేస్తే ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్నిరకాల వ్యాధులకు వైద్య సేవలు అందించే వెసులు బాబు ఉంటుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టిన పాలకులు, నెలకు రూ 4లక్షల ఖర్చుతో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం పేరుతో కొత్త ఆసుపత్రిని ఓ ప్రైవేట్‌ భవనంలో ఏర్పాటు చేయడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందుతాయని పాలకులు చెబుతున్నారేతప్ప ఆ ఆసుపత్రి ఎక్కడ ఉందో.. అక్కడ ఎలాంటి వ్యాధులకు వైద్యసేవలు అందుతాయో తెలియడం లేదని ప్రజలు అంటున్నారు. శవపంచనామాకు మృతదేహాలను తీసుకువచ్చిన సమయంలో ఆసుపత్రిలో బయటి వ్యక్తుల చేత శవపంచనామా చేయించాల్సి వస్తున్నది. కిడ్నీ వ్యాధిగ్రస్థులు  నిత్యం డయాలసిస్‌ కోసం నెల్లూరు, తిరుపతి అసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ప్రైవేట్‌ వైద్యం చేయించుకోలేని నిరుపేదలు మంచానపడి మృత్యువాత పడుతున్నారు.