వెనక్కి తగ్గిన ట్రంప్‌

 కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న నిబంధనలకు స్వస్తి
వాషింగ్టన్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ శిబిరాల్లో ఉంచే విధానానికి స్వస్తి పలుకుతూ కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇటీవల కొన్ని వారాల సమయంలోనే దాదాపు 2500 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిబిరాలకు తరలించారు. కుటుంబాల నుంచి వేరు చేయడంతో పిల్లలు ఏడుస్తున్న ఫొటోలు, వారిని బోనుల్లాంటి ప్రదేశాల్లో నిర్బంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.కుటుంబాలను విడదీయకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల సమస్య పరిష్కారమవుతుందని ట్రంప్‌ వెల్లడించారు. అయితే సరిహద్దులో వలసదారుల నిబంధనల విషయంలో ఏమాత్రం తగ్గేదిలేదని ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. అక్రమ వలసదారుల పట్ల కఠిన నిబంధనలు కొనసాగుతాయన్నారు. తమ సరిహద్దులు మరింత పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. అక్రమ వలసదారులను విచారించే సమయంలో వారి పిల్లలను నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారు. అయితే ఇప్పుడు కుటుంబాన్ని కలిపి ఉంచే విచారణ చేపట్టాలని ట్రంప్‌ ఆదేశించారు. వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేసే విధానాన్ని తొలగించాలని ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్‌ తన భర్తను వేడుకున్నారని శ్వేతసౌధం వెల్లడించింది. ఆ పాలసీని నిలిపేయాలని ఆమె కోరినట్లు తెలిపారు. కుటుంబాలను కలిపి ఉంచేందుకు విూ వల్ల అయినదంతా చేయమని ఆమె ట్రంప్‌ను వేడుకున్నారని మెలానియా కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఈ విధానంపై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో పాటు భార్య మెలానియా నుంచి కూడా ఒత్తిడి ఎదురవవుతున్నందున ట్రంప్‌ ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది.