వెయ్యి డప్పులు ఒకే నినాదం… జై తెలంగాణ

హైదరాబాద్‌, జనవరి 16 (జనంసాక్షి):
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ సమీపంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేయి డప్పులు.. లక్ష గొంతుకలు.. ఒకే నినాదం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెయ్యి డప్పులు ఒకే నినాదమని జై తెలంగాణ, అమరుల స్వప్నం ప్రత్యేకతెలంగాణ అని దాన్ని సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపేయడంతో ఇక్కడి ప్రజలు తమను తాము పరిపాలించుకునే హక్కును కోల్పోయారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దోపిడీదారులు తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణకు ఎవరు ద్రోహం తలపెట్టినా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రులు తెలంగాణ ప్రాంత వనరులను దోచుకుంటున్నారన్నారు. ఉద్యోగాలను అక్రమంగా పొందారని పేర్కొన్నారు. తెలంగాణలో సీమాంధ్రుల పెత్తనం ఇకపై చెల్లదని అన్నారు. 1969 నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ ప్రజలు మోసాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వనరులు, నీళ్లు, నిధులను దోచుకుంటూ మన ప్రాంతంలో మనపై అధికారం చెలాయిస్తూ మనల్ని బానిసలుగా చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తెలంగాణపై ఏరకమైన త్యాగానికైనా వెనుకాడబోమన్నారు. ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి తనువులు చాలించిన అమరవీరుల త్యాగాలు వృథా కాలేదన్నారు. తెలంగాణ అంటే హైదరాబాద్‌ అని అదిలేని రాష్ట్రం మాకవసరం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం మినహా మరో మార్గం కనిపించడం లేదన్నారు. టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడనున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌, గాయకుడు అందెశ్రీ, సంపాదకులు కె. శ్రీనివాస్‌, అల్లం నారాయణ, సీనియర్‌ జర్నలిస్టులు అమర్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.