వేములవాడ అభివృద్ధికి..

కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
– దేవాలయ అభివృద్ధికి రూ.400కోట్లు ఇవ్వడం గొప్ప విషయం
– కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంది
– కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం
– 24గంటల విద్యుత్‌ అందిస్తున్న ఘనత తెరాసదే
– రాష్ట్ర    హోంశాఖ మంత్రి నాయిని
– వేములవాడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
కరీంనగర్‌, ఆగస్టు14(జ‌నం సాక్షి) : వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని, ఆలయ అభివృద్ధి కోసం రూ.400కోట్లు ఇవ్వడం గొప్ప విషయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం వేములవాడలో పర్యటించిన నాయిని రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కొత్తగా 21 అగ్నిమాపక కేంద్రాలు మంజూరు చేశామన్నారు. కొత్తగా ఫైర్‌ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రావని, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక పోతున్నారని, అభివృద్ధిని అడ్డుకొనేందుకు కోర్టులకు వెళ్తున్నారని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధి ఆగదని, ప్రతి ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని, వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగించే టెక్నాలజీని చూసేందుకు తరలి వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రైతులపై పథకాల వర్షం కురిపిస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, రైతు బీమా, రైతుబంధు తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నాయిని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగ మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇందులో బాగంగా ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కంటి సమస్యతో
ఎవరూ బాధపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లుతెలిపారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించటం జరుగుతుందన్నారు.