వేర్పాటు వాదానికీ.. ప్రజల ఆకాంక్షలకు తేడా లేదా?

సమైక్యవాదం.. వేర్పాటువాదం. సీమాంధ్ర పెత్తందారుల సొమ్ముతో పెట్టిన తెలుగు టీవీ చానెళ్లలో ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పదాలివి. సమైక్యాంధ్ర కోరుకునేవారంతా సమైక్యవాదులని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునేవారు వేర్పాటువాదులనీ ఆ చానెళ్ల, కొన్ని పత్రికలు బరితెగించి అబద్ధపు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అబద్ధాల పునాదులపై ఆవిర్భవించిన, నిర్దిష్టమైన ఆధారం లేని సమైక్యవాదానికి బాకా ఊదుతూ నిత్యం ఉదయాన్నే అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నాయి ఆ చానెళ్లు, పత్రికలు. సమైక్యాంధ్ర అంటే 23 జిల్లాలతో కూడిన ప్రాంతం. ఒకప్పుడు రెండు వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతం. మొదటి ఎస్సార్సీలో ఉన్నట్టుగా చెప్పే చిన్న క్లాజు ఆధారంగా భాషాప్రయోక్త రాష్ట్రాలంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను హరించింది కాంగ్రెస్‌ పార్టీ. పెద్దమనుషుల ఒప్పందం బుట్టదాఖలైంది. ముల్కీ నిబంధనలు అసహాస్యమయ్యాయి. తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు సీమాంధ్రులు గంపగుత్తాగా ఎత్తుకెళ్లారు. దీనిని ప్రశ్నిస్తూ 1969లోనే మా రాష్ట్రం మాగ్గావాలంటూ ఉద్యమ పథాన సాగింది తెలంగాణ గడ్డ. అప్పుడు ఇప్పుడు పెట్టుబడిదారుల్లో హెచ్చుమంది పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. తెలంగాణ వనరులను, నీళ్లను, నిధులను గుటకాయ స్వాహా చేసి వారు రాత్రికి రాత్రే కుభేరుల అవతారమెత్తిందీ తెలుసూ. ఈ నయా కుభేర వర్గమే తెలంగాణ ఉద్యమానికి వేర్పాటువాదం అనే విపరీత అర్థాన్నిచ్చింది. వేర్పాటువాదం అంటే తెలంగాణ ప్రజలు భారత దేశం నుంచే విడిపడి కొత్తగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, తద్వారా దేశసమగ్రత, సమైక్యతకూ ముప్పు వాటిల్లనుందని ఆ పెత్తందారి వర్గాల చెప్పుచేతల్లో ఉన్న మీడియా ప్రతినిత్యం కారుకూతలు కూస్తోంది. తెలంగాణ ప్రజలు ఏ ఒక్కో రోజు స్వతంత్ర దేశం కావాలని కోరలేదు. స్వపరిపాలన, ఆత్మగౌరవం కావాలని ఆకాంక్షించారు. మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా వనరులు మాగ్గాలని కోరుతున్నారు. అదీ ప్రజాస్వామ్య యుతంగానే. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్ష వివిధ రూపాల్లో చాటిచెప్పుతున్నారు. 1969లో మాత్రమే తెలంగాణ ఉద్యమం హింసాత్మకమైంది. అదీ అప్పటి సీమాంధ్ర పాలకుల రెచ్చగొట్టే విధానాలతోనే. దానికి ఫలితాన్నీ తెలంగాణే అనుభవించింది. ఉజ్వల భవిత ఉన్న 369 మంది విద్యార్థులను సీమాంధ్ర సర్కారు కాల్చిచంపింది. వారు ఏ ఆశయం కోసమైతే ప్రాణార్పణ చేశారో అది ఇప్పటికీ నెరవేరలేదు. ఇందుకు కేవలం తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ నాయకుల బానిసత్వమే కారణం. అలాంటి వారిని ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు పంపిన మనదే తప్పు. మేము వేర్పాటువాదులం కాదు.. ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కోరుకుంటున్నామని గొంతెత్తి చెప్పడం లేదు. చెప్పరు సరే, ప్రజల ఆకాంక్షలు తెలియచెప్తూ ఉద్యమపథాన సాగుతున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. సీమాంధ్ర నేతల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ నాయకులందరిదీ ఇదే తీరు. ఉద్యమకారులను విమర్శించడం.. తెలంగాణ మీ సొత్తు కాదంటూ హెచ్చరించడం మినహా ప్రజల పక్షాన.. వారి ఆకాంక్షలను చాటుతూ ఒక్క వేదికపై మాట్లాడలేదు. నిత్యం అడ్డంగా మాట్లాడుతున్న ఢిల్లీ పెద్దల ఎదుట మోకరిల్లుతూ అధిష్టానంపై మాకు విశ్వాసముంది.. తెలంగాణ ఇస్తుంది అంటూ మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ నేతలు ఇవే మాటలు చెప్తున్నారు. ప్రజలు వారిని నమ్మి తమ ఆకాంక్ష నెరవేరక పోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరి ఆకాంక్ష నెరవేరడం లేదు సరికదా.. తెలంగాణ కోరుకోవడమే తప్పన్నట్టుగా సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారం సాగిస్తున్నా కిక్కురుమనకుండా ఉంటున్నారు. సీమాంధ్ర మీడియా తెలంగాణ ఆకాంక్ష వాడుతున్న భాష కూడ అత్యంత అభ్యంతరకరం. తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం అంటూ అన్నింటినీ ఒకే ఘాటన కట్టి ప్రచారం సాగిస్తోంది. అయిన మన నేతల్లో చలనం లేదు. కాదు వారు చచ్చుబడిపోయారు. అధిష్టానం ఎదుట, సీమాంధ్ర పెద్దల ఎదుట మోకరిల్లి.. మోకరిల్లి అదే అలవాటుగా మార్చుకున్నారు. వారిని అని ప్రయోజనం లేదు. మన ఆకాంక్షను అవమాన పరుస్తున్న మీడియాకు తగిన బుద్ధి చెప్పి తీరాలి. అది మన చేతుల్లోనే ఉంది.