వేళాపాళా లేని విద్యుత్ కోతను నిరసిస్తూ – వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ధర్నా
నెల్లూరు, జూలై 21 : వేళాపాళా లేని విద్యుత్ కోతలను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో కార్యకర్తలు శనివారం స్థానిక విద్యుత్ భవనాన్ని ముట్టడించారు. అంతకు ముందు రెండు గంటల పాటు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం ఎపిట్రాన్స్‌కో ఎస్.ఈ నందకుమార్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఏ మాత్రం ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. దాదాపు నెల రోజులుగా జిల్లాలోని ప్రజలు చీకటిలో మగ్గిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2గంటల పాటు, మండల కేంద్రాల్లో 8గంటల పాటు, పట్టణాల్లో 6గంటలు విద్యుత్ అమలవుతున్నాయని ఆరోపించారు. ఎస్.ఈ నందకుమార్ సమాధానం ఇస్తూ ఇతర రాష్ట్రల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని వారం రోజుల లోపు సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. దీనితో ధర్నా కార్యక్రమాన్ని విరమించుకున్నారు. మోపిదేవికి న్యాయ సహాయం అందించండి నెల్లూరు, జూలై 21 (ఎపిఇఎంఎస్): ప్రభుత్వ జీవోల విడుదలలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను విడిపించేందుకు ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం నాడు స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మంద్రి మంత్రులకు న్యాయ సహాయం అందిస్తుండగా ఒక్క మోపిదేవి పట్ల వివక్ష చూపడం ఎందుకని ప్రశ్నించారు. మోపిదేవి బిసి వర్గానికి చెందిన వారు కావడం వల్లనే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అయినా వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపటనున్నట్లు శ్రీనివాసులు అన్నారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.