వేసవి ప్రారంభంలోనే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

 ఎండల తీవ్రత తప్పదంటున్న వాతావరణ శాఖ
హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భానుడు మెల్లగా సుర్రుమనిపిస్తున్నాడు. ఎండల తీవ్రత తప్పదని హెచ్చరిస్తున్నాడు. మెల్లగా చలి తగ్గుతూ ఎండల తీవ్రత పెరుగుతోంది. వివిధ చోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మండుతున్నాయి. దీంతో వేసవికి ముందే ఎండలు పెరుగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ యేడు ఎండలు తీవ్రంగా ఉంటాయని మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే మెచ్చరించింది. ప్రతి 21 ఏండ్లకోసారి వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయని, ఇదే ప్రభావం ఈ ఏడాది ఉంటుందని అందువల్ల ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత రెండు మూడు రోజులుగా వరుసగా 32 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎండలో తిరిగేందుకు ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత వల్ల మహిళా కార్మికులు, కూలీ పనులు చేసుకునే వారు
ఇబ్బందులు పడుతున్నా. రానున్న రోజుల్లో జిల్లాలో ఎండల తీవ్రత మరింత ముదురుతుందని స్థానిక వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. ఈనెల చివరి వారం నుంచి కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోక్షిగతలు క్రమంగా మరింత పెరుగనున్నట్లు తాండూరులోని వ్యవసాయ వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. తాండూరు ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో నాపరాళ్ల గనులు, 00 ఎకరాల్లో సుద్ద గనులు విస్తరించి ఉండడం, దీనికి తోడు పరిసరాల్లో ఉన్న ఐదు సిమెంట్‌ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల, పలు పరివూశమల కాలుష్యం కారణంగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కారణమన్నారు. ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి తీవ్రత మరింత పెరుగనున్నట్లు తెలిపారు.
సాధారణంగా వేసవి ప్రారంభంలో గరిష్ఠ ఉష్ణోక్షిగతలు అత్యల్పం నుంచి అత్యధిక స్థాయికి చేరుకోవడం సహజమని, అయితే ప్రస్తుతం అనూహ్యంగా ఒక్కసారిగా గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగడం చాలా అరుదని శాస్త్రవేత్తలు తెలిపారు.  మే నెలలో కనిపించాల్సిన ఎండలు ఈసారి కాస్తా ముందుగానే ముదురుతాయని తెలిపారు. రాజస్థాన్‌ థార్‌ ఎడారుల నుంచి, దక్షిణ పాకిస్తాన్‌ భాగం నుంచి వడగాలుల తీవ్రత పెరుగుతుందన్నారు.