వైఎస్సార్‌ రైతు భరోసాతో 50 లక్షల మందికి మేలు

రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదు బదిలీ
అర్హులందరికీ మేలు జరిగేలా ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ
సంతోషంగా ఉందన్న సీఎం వైయస్‌ జగన్‌
అమరావతి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  వైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినా రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రెండవ విడత కింద వైఎస్సార్‌ రైతు భరోసాను వారి ఖాతాలకు బదిలీ చేశారు.
ఈ సందర్భంగా  జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 అందిస్తున్నాం. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి రూ.2వేలు సాయం అందిస్తున్నాము. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రూ.2వేలు సాయం చేశాం. ఈరోజు మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందిస్తున్నాం. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నామని వివరించారు. ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరా లోపు ఉన్నవారే. పెట్టుబడి సాయంతో మెరుగైన భద్రత, ఉపాధి లభిస్తుంది. తొలిసారిగా ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లిస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు.. ఖరీఫ్‌ సీజన్‌లోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ చెల్లించడం ఇదే తొలిసారి. 1.66 లక్షల మంది రైతులకు 135.7 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్నాం’ అని అన్నారు.
వాస్తవ సాగుదార్లందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్దిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్‌లో లబ్దిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్‌ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్‌తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందనున్నారు. 50,47,383 మంది లబ్దిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందనుంది. అరకోటికి పైగా రైతులకు దాదాపుగా రూ.6800 కోట్లు సాయంగా అందిస్తున్న పథకం వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం.  పీఎం కిసాన్‌ పథకం. కొన్ని పథకాలు అమలు చేస్తున్నప్పుడు చాలా
సంతోషాన్ని ఇస్తాయని సిఎం జగన్‌ అన్నారు. ఇద్దరు, ముగ్గురు కాదు. ఏకంగా 50 లక్షల పైచిలుకు మంది రైతు కుటుంబాలకు ఈ పథకంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే అందులో 50 లక్షల పైచిలుకు ఇళ్లకు మేలు చేస్తున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపుగా ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటికి మేలు జరుగుతుంది. ఈ మేరకు పెట్టుబడి సాయం రైతులకు అందించగలుగు తున్నామంటే.. నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందంటూ సిఎం జగన్‌ తన సంతోషాన్నివ్యక్తం చేసారు.