వైఎస్సార్‌ సీపీతో బీజేపీ కుమ్మక్కు


 బీజేపీ కుమ్మక్కు

వైఎస్సార్‌ సీపీతో బీజేపీ కుమ్మక్కు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు
చిన్న రాష్ట్రాలపై ఏపీలో ఓ మాట.. యూపీలో మరో
సీమాంధ్రలో జై ఆంధ్ర ఎందుకంటలేరు
తెలంగాణ ఓట్లు చీల్చేందుకే బరిలో
బీజేపీపై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి): పరకాల నియోజకవర్గంలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని ఓడించడమే అన్ని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. సోమవారం  తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమైక్య వాద పార్టీలేనని, తెలంగాణ వాదులమని చెప్పుకునే బీజేపీ సైతం సమైక్య వాది పార్టీ అయిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ని గెలిపించేందుకే అక్కడ పోటీ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. గతంలో అంబర్‌పేట స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి కిషన్‌రెడ్డి గెలిచేలా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహాయం చేశారని, ఈ వ్యవహారంలో అప్పటి కార్ణాటక మంత్రి బీజేపీ నాయకుడు  గాలి జనార్దన్‌రెడ్డి సహకారంతోనే ఆ పని చేశారని అన్నారు. అప్పటి వైఎస్‌ రుణం తీర్చుకునేందుకు కిషన్‌రెడ్డి ఇప్పుడు పరకాలలో టీఆర్‌ఎస్‌ను ఓడించి  కొండా సురేఖను గెలిపించేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపిం చారు. రాష్ట్రంలో 18 స్థానాల్లో ఎన్ని కలు జరుగుతుండగా, కేవలం పరకాలలోనే ప్రచారం చేస్తున్నారని, సీమాంధ్రలోని17 స్థానాలలో వైఎస్సార్‌ సీపీ ముందంజలో ఉందని భావించి పరకాలలో కూడా ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకే వారు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ జవదేకర్‌, సుష్మాస్వరాజ్‌ వంటి జాతీయ నాయకులు కూడా ఢిల్లీ టూ హైదరాబాద్‌, హైదరాబాద్‌ టూ పరకాల వస్తున్నారే తప్ప మిగతా స్థానాల్లో ఎందుకు ప్రచారం చేయడంలేదని ఆయన నిలదీశారు. కిషన్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడా? లేక పరకాల మండల  అధ్యక్షుడా? స్పష్టం చేయాలన్నారు. ఆయన ఒక గల్లీ లీడర్‌లా తొమ్మిది రోజుల పాటు పరకాలలోనే ప్రచారం చేయడంలో అర్థం ఏమిటని అన్నారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదని, అతి భారతీయ జగన్‌ పార్టీలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజలను గతంలోనే మోసం చేసిందని, 1992లో కాకినాడ సభలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధిపొందిందని, ఆ రోజు చంద్రబాబు వల్లే తాము తెలంగాణ ఇవ్వలేదని చెబుతున్న ప్రకాశ్‌ జవదేకర్‌ రేపు వెంకయ్య నాయుడు అడ్డుపడినా ఇస్తామని హామీ ఇవ్వగలరా? అంటూ నిలదీశారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూల మంటున్న బీజేపీ మాయావతి తీర్మానాన్ని ఎందుకు వ్యతిరేకించారని, యూపీలో ఒక మాట, ఏపీలో ఒక మాట, ఇదీ ఒక జాతీయ పార్టీయేనా అంటూ నిలదీశారు. ఇద్దరు లోక్‌సభ సభ్యులున్న టీఆర్‌ఎస్‌ వారం రోజుల పాటు లోక్‌సభను తెలంగాణ అంశంపై స్తంభింపజేసిందని, 160 మంది ఎంపీలున్న బీజేపీ సభ్యులు ఎందుకు స్తంభింపజేయలేదని అన్నారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఆ నినాదంతో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీలను ఎందుకు సస్పెండ్‌ చేయించిందని ఆయన మండిపడ్డారు.  తెలంగాణ వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పిన విషయాన్ని గర్తు చేస్తూ వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వీసా తీసుకునే పరకాలకు వస్తుందా ? అంటూ ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చే విజయమ్మ ముందు తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో తేల్చి చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.