వైకాపా అధికారంలోకి రావడం తథ్యం: అమర్‌నాథ్ రెడ్డి
కడప,జూన్11(జనం సాక్షి): పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైకాపాజిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి అక్రమాలను ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో ఏ ఒక్కటిని అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అమలులో పాలకుల వైఫల్యాన్ని ఎండగడుతూ వైసిపి అభివృద్ధికి కృషిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి విజయం సాధించి అధికారంలోకి రావడం తధ్యమని పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర పేరుతో వ్యక్తిగతంగా ప్రజలను కలుస్తుంటే టిడిపిలో వణుకు పుడుతోందని అన్నారు. అనేక వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత మరిచిపోయారని వాపోయారు. వైఎస్ హాయంలో రూపుదిద్దుకున్న కుందూ -పెన్నా వరద కాలువ ఇంత వరకు పూర్తి చేయకపోవడం శోచనీయం అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే గండికోట రిజర్వాయర్ నుంచి ఒక టిఎంసి నీటిని పెన్నానదికి వదిలి ప్రొద్దుటూరు నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీపై కార్యకర్తలకు, నాయకులకు విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ఓటుకు నోటు కేసులో భయపడి చంద్రబాబునాయుడు ప్రత్యేక¬దా పక్కనపెట్టి ప్యాకేజి పల్లవి అందుకున్నట్లు విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు కార్యకర్తలు, నాయకులు సిద్దంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే స్థితి లేదన్నారు.