వైకాపా ప్రభుత్వానికి..  విధ్వంసమే ప్రధాన అజెండా

– అమరావతిని చంపేసేస్థితికి తీసుకొచ్చారు
– వందరోజుల్లో ఏ ఊళ్లో అయినా ఒక్క పనిజరిగిందా?
– రివర్స్‌ టెండరింగ్‌ అంటూ రాష్టాన్న్రి రివర్స్‌ చేశారు
– ఊరికో ప్యాలస్‌ కట్టుకున్న వ్యక్తి గృహనిర్మాణంలో అవినీతి అంటున్నాడు!
– ప్రత్యేక ¬దా ఎప్పుడు సాధిస్తాడో జగన్‌ చెప్పాలి
– పాతతరం అనుభవం, కొత్తతరం ఉత్సాహం రెండూ తెదేపాకు అవసరం
– ప్రతి సీనియర్‌ నేత ఓ కొత్త యువ నాయకున్ని తయారు చేయాలి
– తూర్పుగోదావరి నుంచే తెదేపా శ్రీకారం చుడుతోంది
– ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
కాకినాడ, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   వైకాపా పాలన ప్రారంభమై వందరోజులు అవుతుందని, అయినా ఇప్పటి వరకు ఏ గ్రామంలోనూ ఒక్కపనిని చేపట్టలేదని, వైకాపాకు రాష్ట్ర విధ్వంసమే ప్రధాన అజెండా అనిఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన జిల్లా తెదేపా విస్త్రృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వం నిలదొక్కుకునేందుకు ఆరు నెలలు సమయం ఇస్తామని ప్రకటించామని, కానీ సీఎం జగన్‌ తొలి రోజు నుంచే అరాచకాలు ప్రారంభించారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశానికి కంచుకోట అని, ప్రశాంతంగా ఉండే ఈ జిల్లాలోనూ దాడులు జరగడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త ప్రభుత్వం ఏదైనా వంద రోజుల్లో ఓ దశాదిశ ఏర్పాటు చేసుకుంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో అప్రతిష్టపాలై ప్రజల్లో చులకనైందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇంత రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, మాజీ మంత్రి వివేకానందరెడ్డిని దుండగులు ఇంట్లోనే చంపినప్పటికీ ఇంతవరకూ కనిపెట్టలేక పోయారని విమర్శించారు. సన్నబియ్యాన్ని నాణ్యమైన బియ్యమంటూ మాటమార్చి మడమ తిప్పారని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని చంపేసే పరిస్థితికి తెచ్చారని, పైసా ఖర్చులేకుండా సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌తో ముందుకు పోయే ప్రాజెక్టును దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వందరోజుల్లో ఏ ఊళ్లో అయినా ఒక్కపని జరిగిందా అని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ రాష్టాన్ని రివర్స్‌ చేశారని ఆరోపించారు. ఊరికో ప్యాలస్‌ కట్టుకున్న వ్యక్తి గృహనిర్మాణంలో అవినీతి అంటున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. పార్టీకి యువరక్తం కావాలని, యువతరం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరో 30ఏళ్ల వరకు నాయకులను తయారు చేసే శక్తి తెదేపాకు ఉందని పునరుద్ఘాటించారు. పాతతరం అనుభవం, కొత్తతరం ఉత్సాహం రెండూ తెదేపాకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సీనియర్‌ నేత ఓకొత్త యువ నాయకుడిని తయారు చేయాలని అన్నారు. ఈ నూతన అధ్యాయానికి తూర్పుగోదావరి నుంచే తెదేపా శ్రీకారం చుడుతోందని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక ¬దా ఎప్పుడు సాధిస్తారో ప్రజలంతా జగన్‌ను నిలదీయాలని చంద్రబాబు  పిలుపునిచ్చారు. కేవలం ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులు చేయటానికి పాలనను జగన్‌ ఉపయోగిస్తున్నాడని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. వందరోజుల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న సీఎం చరిత్రలో మరొకరు లేరని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మనకు వేధింపులు పెరిగే కొద్దీ.. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గరపడినట్టు లెక్క అన్నారు. ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాడులకు పాల్పడుతున్నారంటే వైసీపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వివరించారు. నెలలు గడుస్తున్నా సొంత బాబాయిని ఎవరు హత్య చేశారో తేల్చడంలేదని విమర్శించారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రం మొత్తం రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ బాధితుల కోసం… పునరావాస కేంద్రం పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి, డీజీపీకి చెప్పినా దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్టిమేటం ఇచ్చినా ఆత్మకూరు బాధితులను తిరిగి వారింటికి చేర్చలేదన్నారు. పోలీసులకు సవాల్‌ చేస్తున్నా.. విూరు చేయలేని పని చలో ఆత్మకూరు పేరుతో తాము చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులకు గట్టిగా చెబుతున్నా.. తాత్కాలిక పోస్టింగ్‌ల కోసం టీడీపీ కార్యకర్తలను వేధించొద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో యనమల, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జవహర్‌ హాజరయ్యారు.