వైద్యురాలిపై హత్యాచారం దారుణమన్న సీతక్క

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మీద హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కోల్‌కతాలో జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీలను నిలిపివేశారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. అదే సమయంలో ఓ రోగిని పరామర్శించేందుకు మంత్రి సీతక్క అక్కడకు వచ్చారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు ఆమె సంఘీభావం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసన

కోల్‌కతాలో డాక్టర్‌పై దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ హత్యాచార ఘటనపై తెలంగాణవ్యాప్తంగా వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేసింది. ఓపీ సేవలను నిలిపివేశారు. హైదరాబాద్‌లోని గాంధీ, కోఠి ఈఎన్టీ, నిమ్స్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధులను బహిష్కరించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.