వైభవంగా దశావతార వెంకటేశుని విగ్రహ ప్రతిష్ట

విగ్రహ పత్రిష్టలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌
ఎడమొహం పెడమొహంగా ఇద్దరు నేతలు
గుంటూరు, జూన్‌22(జ‌నం సాక్షి ) : గుంటూరు జిల్లా నంబూరులో ఏఎన్‌యూ ఎదురుగా శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సీఎం, పవన్‌ చాలా రోజుల తర్వాత ఒకే కార్యక్రమంలో పక్కపక్కనే కనిపించడం విశేషం. అయితే వీరి మధ్య ఎలాంటి మాటలు, రాజకీయపరమైన చర్చలు జరగలేదు.గణపతి సచిదానంద స్వామి ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో యంతప్రతిష్ట నిర్వహించారు. 11 అడుగుల వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. గరుడ ఆల్వార్‌, విశ్వక్‌సేనుడి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మ¬త్సవం కూడా నిర్వహించారు. దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు, లాంఛనాలతో ఆలయానికి విచ్చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆలయంలోకి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు అయినంత వరకు ఇరువురు నేతలు ఆలయంలోనే ఉన్నారు. తర్వాత పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు పక్కనుంచి వెళ్లిపోయారు. వీఐపీల రాకతో ఆలయ ప్రాంగణంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈనెల 24న ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వారిని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఎడమొహం, పెడమొహగా చంద్రబాబు, పవన్‌!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో వేంకటేశ్వరస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత.. పైగా ఇరు పార్టీల బంధం వీగిపోయిన తర్వాత తొలిసారి వీరిద్దరూ ఎదురుపడటంతో ఏం మాట్లాడుకుంటారన్న ఆసక్తి విూడియాతో పాటు, ప్రజల్లో కూడా నెలకొంది. అయితే చంద్రబాబు, పవన్‌ మాత్రం పలకరించుకోకపోవడం కొసమెరుపు. ఆలయంలో పక్కపక్కనే నిల్చున్నారు. కానీ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. భక్తులను పలకరిస్తున్న సమయంలో కూడా చంద్రబాబుకు పవన్‌ తారసపడ్డారు. అయినప్పటికీ ఇద్దరూ పట్టించుకోకుండా.. పలకరించుకోకుండానే వెళ్లిపోయారు. తెదేపా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పవన్‌
కళ్యణ్‌ గత ఆర్నెళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. తన బహిరంగ సభలు, పాదయాత్రల్లో తెదేపా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఏకంగా మంత్రి లోకేష్‌ అవినీతి పరుడంటూ ఆరోపణలు సైతం చేశారు. దీనిపై లోకేష్‌తో పాటు చంద్రబాబు, తెదేపా నేతలు ఘాటుగానే స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ అనుసంధాన నే అంటూ విమర్శలు గుప్పించారు. ఈపరిణామాలతో టీడీపీ, జనసేనల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. కాగా కొన్ని నెలల తరువాత శుక్రవారం చంద్రబాబు, పవన్‌లు ఒకే కార్యక్రమంలో పక్కపక్కనే పాల్గొనడంతో అందరూ ఆసక్తిగా గమనించారు. అయినా వీరు ఒకరినొకరు పలుకరించుకోకుండానే కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు.