వైభవంగా భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు

అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు
వరంగల్‌,అక్టోబర్‌4  (జనంసాక్షి):   శరన్నవరాత్రి మ¬త్సవాలలో భాగంగా ఆరో రోజు శుక్రవారం భవానిమాతగా వరంగల్‌ భద్రకాళీ దేవి దర్శనమిచ్చారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అలంకరణలో ఉదయం పల్లకిసేవ రాత్రి శేష వాహన సేవతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇకపోతే దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ భాస్కర్‌ శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రులకు, చీఫ్‌ విప్‌ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవి నవరాత్రుల సందర్భంగా వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వారికి ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు పేర్కొన్నారు. మంత్రులకు స్వాగతం పలికిన వారిలో ఆలయ అధికారులు, వేద పండితులు, పాలకవర్గ సభ్యులున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భారీగా ప్రజలు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.