వైయస్‌ జగన్‌ పార్టీలోకి న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ ఆదివారం చేరారు. నర్సంపేట టిక్కెట్‌ ఆశించి తాను  పార్టీలో చేరడం లేదని రాణీ రుద్రమ ఈ సందర్భంగా చెప్పారు. కాగా అంతకుముందు చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే విజయమ్మను కలిసిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాతనే తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని వారు చెప్పారు.
రాష్ట్రం మొత్తం వైయస్‌ జగన్‌ వెంటే ఉందన్నారు. తంబళ్లపల్లి, పలమనేరు నియోజకర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తాము వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు  చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన తప్పు పట్టారు. తమను టీడీపీ బహిష్కరించడం కాదని, టీడీపీనే రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బహిష్కనించారన్నారు.
చిత్తూరు జిల్లాలో త్వరలో జరిగే బహిరంగ సభలో తాను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని ప్రకటించారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అందుకే తాను జగన్‌ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మైనార్టీలో పడిపోయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీలో చంద్రబాబు  ఒక్కరే  మిగులుతారన్నారు. ప్రజల అభీష్టం మేరకే తాము జగన్‌ పార్టీలో చేరుతున్నామన్నారు.