వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు

– ఎంపీడీవో సరళ ఫిర్యాదుతో కేసు నమోదు
– అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా?
– వైసీపీ నేతలతీరుపై చంద్రబాబు ఆగ్రహం
నెల్లూరు,అక్టోబర్‌5  (జనంసాక్షి): నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు గ్రావిూణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సరళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు వెంకటాచలం మండల పరిధిలోని అనికేపల్లిలో ఎమ్మెల్యే అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన లేఅవుట్‌కు పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోటం రెడ్డి అడిగారని, ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా మూడు రోజుల క్రితం ఫోన్లో బెదిరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో మద్యం సేవించి అనుచరులతో కలిసి కోటంరెడ్డి తన ఇంటిపై దౌర్జన్యానికి దిగారని సరళ ఆరోపించారు. పోలీసులు ఇంటి వద్దకు వచ్చి ఫిర్యాదు తీసుకున్నా.. కేసు పెట్టేందుకు శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్‌కు వెళ్తే మాత్రం ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని ఎంపీడీవో ఆమె వాపోయారు. దీనికి సంబంధించి వార్తలు ప్రసార మాధ్యమాల్లో విస్త్రృతం కావడంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు, ఆయన అనుచరుడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్న అధికారిణిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని అర్ధరాత్రి వేళ ఆమె పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే..కేసు నమోదు చేసేందుకే జంకారంటే రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఉన్నట్టా? లేనట్టా? అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. వైకాపా నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా? అంటూ ధ్వజమెత్తారు. ఆమె ఇంటికి విద్యుత్‌, నీటి కనెక్షన్‌ కట్‌ చేసి, చెత్తకుండీ పెడతారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఈ విషయాలేవిూ ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించవా? అంటూ నిలదీశారు.
రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కరువైంది – లోకేష్‌
రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైందని ట్విట్టర్‌ వేదికగా నారా లోకేష్‌ దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ.. మహిళా అధికారిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై జగన్‌ కక్ష దేనికో అర్థం కావట్లేదన్నారు. 45 ఏళ్లకే పెన్షన్‌ అని మోసం చేశారని, మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారా దుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పుడు మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపీడీవో సరళ పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారని, ఇక రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోందని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.