వ్యక్తిగత మరుగుదొడ్లపై కొరవడిన అవగాహన

ప్రోత్సహిస్తున్నా ముందుకు రాని ప్రజలు

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ప్రైవేటు కూలీలను ఏర్పాటు చేయించు కొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలుగా అందిస్తున్నారు. తద్వారా

పంచాయతీలపై ఆర్థిక భారం పడుతోంది. గ్రామాల్లో సర్పంచ్‌లు పటిష్టంగా పనిచేయడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేసేలా అధికారులు కార్యాచరణ సిద్దం చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం తొలిసారిగా ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా గ్రామాల్లో జోరుగా దీనిపై శ్రద్ద పెడుతున్నారు. వ్యక్తిగత మరగుదొడ్లు నిర్మించుకోకుంటే ప్రభుత్వ పథకాల అమలు నిలిపివేస్తామని హెచ్చరించడం మొదలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం, తెలంగాణలో కళాకారుల ద్వారా ధూమ్‌ధామ్‌లు నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తోంది. బహిరంగ మలవిసర్జన రహిత ఊళ్లు, ఇంటింటా మరుగుదొడ్లు’ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికి మూడేళ్లు గడిచాయి. గ్రామసీమల్లోని 42 శాతం జనాభాకు నేటికీ మరుగుదొడ్లు కరవైన పరిస్థితిలో, కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వాలూ వాటి నిర్మాణ నిర్వహణల్ని ఓ సవాలుగా భావిస్తున్నాయి.

వార్డు కమిటీలు, స్వయంసహాయక సంఘాలు, పట్టణ సమాఖ్యల ఉమ్మడి కృషితో జనగామ అనతికాలంలోనే లక్ష్యం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో 46శాతం ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వివిధ విభాగాలవారితో ప్రచార బృందాల్ని ఏర్పాటుచేసి, మారుమూల గ్రామాలకీ పంపించీ అవగాహన పెంచేందుకు కృషిచేస్తోంది. ఏపీలోని 1410 గ్రామాలు బహిర్భూమి సమస్య నుంచి సంపూర్ణంగా బయట పడ్డాయని కేందప్రభుత్వ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఇదివరకే

వెల్లడించింది. మొత్తం 72లక్షల మరుగుదొడ్లు అవసరమైన ఏపీలో ఇప్పటికే 44.1 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి ఏర్పాటుతో పాటు వినియోగమూ ముఖ్యమంటూ వందల సంఖ్యలో సదస్సులు నిర్వహించారు. పాఠశాలల్లో మరుగదొడ్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి ప్రాథమ్యంగా ప్రకటించింది. ప్రభుత్వాల, ప్రజల ఆలోచనా ధోరణిని బట్టే శౌచాలయ నిర్మాణ పక్రియ ముందుకు సాగుతుంది.