వ్యవసాయరంగంపై ఇంకెన్నాళ్లీ చిన్నచూపు

అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారించని ప్రభుత్వాలు
నిరుద్యోగ సమస్యను తేలికగా తీసుకోవడం వల్లనే సమస్యలు
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): రైతులకు పెట్టుబడి రెండింతలు దక్కేలా వ్యవసాయాన్ని  అభివృద్ది చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించి నాలుగేళ్లయినా దేశంలో అలాంటి మార్పులకు చర్యలు తీసుకోవడం లేదు. వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు  జరగడం లేదు. దీంతో రైతు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. రైతుల ఆదాయం పెరగాలంటే అన్ని ప్రధాన పంటల్లో అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలపై పరిశోధనలు జరగాలి. ప్రభుత్వం అందుకోసం నిధులు కేటాయించాలి. సేంద్రీయ సాగు పద్ధతుల్ని రూపొందించి, అమలు చేసేందుకు కఠినంగా ముందుకురావాలి. వ్యవసాయానుబంధ సంస్థలను ప్రోత్సహించాలి. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల ప్రమేయం లేకుండా చేయాలి. వ్యవసాయం లాభసాటిగా తీర్చిదిద్దుకునే విద్యను తప్పనిసరి చేయాలి.   వ్యవసాయ రంగాలను ప్రోత్సహించి, అనుబంధ రంగాలను స్థాపిస్తే అన్నదాతతో పాటు లక్షలాది మందికి ఉపాధి దక్కుతుంది. వ్యవసాయమంటే చిన్నచూపు కారణంగానే మనం ముందుకు సాగడం లేదు. పరిశ్రమలకు వేలకోట్ల పన్ను రాయితీలు ఇస్తున్న వారు అన్నదాతల విషయం వచ్చే వరకు చిన్నచూపు చూస్తున్నారు. దేశంలో అక్కరకురాని పరిశ్రమల వెంట పడుతూ, పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్న తీరువల్ల అనేక విపరీత పరిణామాలు చూడాల్సి వస్తోంది.  పాలకులు దేశంలో అత్యధికంగా ఉన్న రైతాంగం గురించి ఆలోచించడం లేదు. పంటలు దిగుబడి వచ్చినప్పుడు ధరలు ఉండడం లేదు. ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావడంలేదు. ఇటీవల ఉల్లి ఇధరలు బాగా పెరిగినప్పుడు విదేశాల నుంచికోట్లు కుమ్మరించి కొనుగోళ్లు చేశారు. కానీ మనదేశంలో ఇపపుడు ఉల్లి పండినా గిట్టుబాటు ధరలు చెల్లించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతులు ఏ పంట పండించాలన్నా జంకుతున్నారు.  సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడేళ్లుగా వరుస కరువులు, ఈ ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతుల్ని అంతులేని నిర్వేదంలో జీవిస్తున్నారు. ఖరీఫ్‌ రైతును నిరాశకు గురిచేసింది. దొరికిన చోటల్లా అప్పులు చేసి రైతులు రబీ కోసం సిద్ధం అవుతున్నారు. రబీ పంటతో అయినా కనీస ఆదాయం లభిం చకపోతే సన్న, చిన్నకారు రైతుల
పరిస్థితి దుర్భరంగా మారింది. మక్క,ఉల్లి,పత్తి, సోయాబీన్‌ తదితర పంటలు పండించిన రైతులు ఇప్పుడ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ముందుచూఊపు లేని కారణంగా జనాభాలో 60 శాతానికి పైగా ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగం దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. దేశంలోని అన్నదాతలను ఆదుకుంటే  ప్రపంచానికి కూడా అన్నం పెట్టే స్థాయిలో ఎదుగుతారు. రైతన్న పండించే పంటలకు  ప్రోత్సాహక ధరలు ఇస్తూనే అనుబంధ రంగాలను స్థాపించేందుకు ముందుకు రావాలి. మక్కలు బాగా పండే ప్రాంతంలో మక్క ఆధారిత సంస్థలను ఏర్పాటు చేయాలి. దీంతో పశువుల, కోళ్ల దాణాలు తయారు చేసుకోవచ్చు. అలాగే కార్న్‌ ఫ్లోర్‌, ప్లేక్స తయారికి ముందుకు రావాలి. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దురవస్థ రాదు. తెలంగాణాలో మక్కలు బాగా పండుతాయి. ఈ రంగంపై దృష్టి పెడితే రైతుల సమస్యలతో పాటు, ఉపాధి సమస్య తీరుతుంది. అలాగే రాయలసీమలో వేశరుశనగ బాగా పండుతుంది. దీంతో ఆయిల్‌ ప్రొడక్షన్‌ చేయించుకోవాలి. కానీ విదేశాల నుంచి దిగుమతులకు మనం అలవాటుపడ్డాం. పాలకులు దీనిపైనే ఉత్సాహంగా ఉన్నారు తప్ప అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడం లేదు. మదనపల్లి తదితర ప్రాంతాల్లో టమాటాలు బాగా పండుతున్నా అనుబంధ పరిశ్రమలు లేక రైతులు పంటను రోడ్లపై పారేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచనచేస్తే వ్యవసాయరంగం బలోపేతం కాగలదు. సన్న, చిన్నకారు రైతులు ఎంతో కాలం ఆదాయ భద్రత లేకుండా వ్యవసాయం చేస్తూ పోతున్నారు. పరిశ్రమలు, ఐ.టి. తదితర రంగాలకు ప్రభుత్వం స్పష్టమైన పాలసీలు రూపొందించి వాటిని అమలు చేస్తున్నది. సగానికి పైగా ప్రజల జీవితాలను శాసించే వ్యవసాయరంగ సమగ్ర వికాసానికి మాత్రం ప్రభుత్వం వద్ద స్పష్టమైన విధానం లేదు. పరిశోధన, విస్తరణ విషయాల్లో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు చేదోడువాదోడుగా ఉంటున్నది. రైతును మాత్రం అన్ని విషయాల్లో చిన్నచూపు చూస్తున్నది. విత్తనాల కోసం రైతులు ప్రైవేటు సంస్థల విూద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా నకిలీ విత్తన కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. నాసిరకం విత్తనాలు అంటగట్టి వారిని దివాలా తీయించాయి. నాణ్యమైన విత్తనాలు లభించక రైతులు నామమాత్రంగా దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం నానాటికీ తగ్గిపోతున్నది. మిర్చి, పత్తి, కూరగాయల పంటల్లో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను రూపొందించేందుకు ఎంలాంటి పరిశోధనలు జరగడం లేదు. ఈ ఏడాది నకిలీ విత్తనాల కారణంగా రైతులు వందల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయారు. లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోలేక పోయింది. కనీసం అలాంటి కంపెనీల్లో భయం కూడా కల్పించలేకపోయింది. సన్నకారు చిన్నకారు రైతులు దళారీల చేతిలో నష్టపోకుండా ఉండాలంటే ఉమ్మడి వ్యవసాయం, ఉమ్మడి మార్కెటింగ్‌ విధానాలు అమలు చేయాలి. చదవుంటే బిటెక్‌, సంపాదన డాలర్‌, చూపు అమెరికా అన్న భావన పోయి, వ్యవసయాన్ని కార్పోరేట్‌ స్థాయికి తీసుకుని వెళ్లాలి. దీంతో విదేశీ మారకం పెరగగలదు. దిగుమతులు తగ్గగలవు. ఉపాధి అవకాశాలు పెరగుతాయి.