వ్యవసాయ మోటర్ల మార్పునకు రంగం సిద్దం

విద్యుత్‌ ఆదా లక్ష్యంగా సర్కార్‌ యోచన

అమరావతి,జూన్‌15(జ‌నం సాక్షి ):వ్యవసాయ సర్వీసుల విద్యుత్‌ వినియోగంలో 30 శాతం విద్యుత్‌ ఆదా అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం బావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిఎం చంద్రబాబు ఈ రకమైన ప్రతిపాదనలు చేయగా ఇప్పుడు అమలుకు సిద్దం అవుతున్నారు. వ్యవసాయ పంపుసెట్ల మార్పిడి వల్ల పెద్ద ఎత్తున విద్యుత్‌ ఆదా కాగలదని గణాంకాలు ఉన్నాయి. ఆర్నెళ్లలో మార్పిడి వ్యవహారాన్ని పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గృహావసరాలకు ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇఇసిఎల్‌ కార్పొరేషన్‌ సంస్థ (ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ సంస్థ)ను ఎంపిక చేసింది.ప్రభుత్వం విద్యుత్‌ ఆదా చేసుకునే పక్రియలో భాగంగా ఫైవ్‌ స్టార్‌ గుర్తు కలిగిన మోటార్‌ పంపుసెట్లను ఉచితంగా ఏర్పాటు చేయనుంది. కొత్త పంపుసెట్లకు సెల్‌ ఆధారిత సిగల్స్‌ ఆధారంగా మోటార్‌ను ఆపరేట్‌ చేసుకునే సాంకేతిక సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు మోటార్‌ పంపుసెట్ల మరమ్మతులు చేయడానికి సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రైతులకు నిర్వహణ ఖర్చులు, పాముకాట్లు, కరెంటుషాక్‌ వంటి ప్రమాదాలను అధిగమించే అవకాశం కనిపిస్తోంది.ఈమేరకు రైతుల అభిప్రాయాలను సేకరించి, దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించింది. తూర్పు ప్రాంత విద్యుత్‌ నియంత్రణ సంస్థకు తూర్పు, పశ్చిమగోదారి ప్రాంతాలకు చెందిన ఐదు జిల్లాలు, దక్షిణ ప్రాంత విద్యుత్‌ నియంత్రణ మండలి రాయలసీమలోని నాలుగింటితో పాటు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలను పర్యవేక్షిస్తోంది. ఉచిత విద్యుత్‌ కారణంగా 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం తగ్గే అవకాశం ఉన్నట్లు ఓ అంచనా. మిగులు యూనిట్ల వ్యయాన్ని లెక్కిస్తే సుమారు రూ.210కోట్లు మిగలనుంది. ట్రాన్స్‌కో 30 శాతం ఆదాయాన్ని ఇఇఎస్‌ఎల్‌ సంస్థకు మూడేళ్లలో బదలాయింపు చేయనుంది. పాతవాటి స్థానంలో కొత్త పంపు సెట్లను ఏర్పాటు చేసి వాటిలో తలెత్తే మరమ్మతులకు సంస్థ పూచీ పడనుంది. ఇంఉదలో భాగంగా వ్యవసాయ, గృహావసరాలకు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేస్తారు. ఇదేతరహాలో మండలాల వారీగా ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా దశలవారీగా వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేయనుంది. పంపుసెట్ల సరఫరా సంస్థ డివిజన్‌, మండల కేంద్రాల్లో ఒకే పాయింట్‌లో పంపుసెట్లను పెట్టి అందజేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల చాలా మందికి అందడంపై అనుమానం వ్యక్తమవుతోంది. రైతులు కొత్తపంపు సెట్లను తీసుకునేందుకు తటపటాయించే అవకాశం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిబోరు దగ్గరికి వెళ్లి పాతసెట్టు స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేస్తేనే విజయవంతమయ్యే అవకాశం ఉంది. అలాగే వారిలో భరోసా కల్పించి ఆపరేట్‌ చేసే విధానాన్ని కూడా వివరిస్తారు.