వ్యాపం కుంభకోణంలో కీలక నిందితుడు రమేశ్‌ శివ్‌హరే అరెస్ట్‌

భోపాల్‌,మే4(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన వ్యాపం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రమేశ్‌ శివ్‌హరే అరెస్ట్‌ అయ్యాడు. రమేశ్‌ను సీబీఐ అధికారులు  బుధవారం కాన్పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వ్యాపంలో కుంభకోణంలో అనేకమంది రాజకీయ నాయకులు, పైస్థాయి అధికారులు, బోర్డు ఉద్యోగులు, పలువురు విద్యార్థులు నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారం మొత్తం దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. ఇందులో వందల కోట్లు చేతులు మారినట్లుగా తేలింది.  ఇప్పటివరకు వందల సంఖ్యలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్‌ శర్మ సైతం గతంలోనే అరెస్ట్‌ అయ్యారు. కాగా మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతిచెందుతున్నారు. వ్యాపం కుంభకోణంగా పేరొందిన మధ్యప్రదేశ్‌ వృత్తి పరీక్షల బోర్డు అక్రమాలకు సంబంధించిన కేసులో  కీలక నిందితుడిగా ఉన్న రమేశ్‌ శివ్‌హరే ఇంతకాలం పరారీలో ఉండగా  పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ చేపట్టిన తనిఖీల్లో భాగంగా వ్యాపం కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన రమేశ్‌ శివ్‌హరే అనే వ్యక్తిని బుధవారం కాన్పూర్‌లో అరెస్టు చేసినట్లు యూపీ డీజీపీ జావేద్‌ అహ్మద్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేశ్‌ వైద్య వృత్తి పరీక్ష రాసేందుకు నకిలీ విద్యార్థులను తీసుకురావడానికి మధ్యవర్తిగా వ్యవహరించాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో అతడిని విచారించేందుకు అధికారులు ప్రయత్నించగా.. రమేశ్‌ అందుకు నిరాకరించాడు. కాగా.. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం 2014లో మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు అతడి పిటిషన్‌ను తిరస్కరించడంతో ఇంతకాలం పరారీలో ఉన్న అతడిని కాన్పూరులో అరెస్టు చేశారు.సుప్రీం ఆదేశాలతో సీబీఐ కేసు దర్యాప్తును చేపట్టింది.