శబరిమలకు బయలుదేరిన మహిళపై దాడి


– సీపీ కార్యాలయం ఎదుటే దాడి
– పెప్పర్‌ స్పేత్రో దాడికి పాల్పడ్డ వ్యక్తి
తిరువనంతపురం, నవంబర్‌26  ( జనం సాక్షి ) : కేరళలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళా హక్కుల నేత తృప్తి దేశాయ్‌తోపాటు మొత్తం ఆరుగురు మహిళలు శబరిమల కేరళ వచ్చారు. శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భద్రత కల్పించాలంటూ కొచ్చి సిటీ పోలీసు కమిషనర్‌ను వారు ఆశ్రయించారు. అయితే, వారి బృందంలో ఒకరైన బిందు అమ్మినిపై సీపీ కార్యాలయం ఎదుటే దాడి జరిగింది. హిందూ సంస్థల కార్యకర్త ఒకరు కారంపొడి స్పేత్రో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. గత జనవరిలో హిందూ సంస్థల కళ్లుగప్పి బిందు అమ్మిని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తాజాగా కూడా తృప్తి
దేశాయ్‌తో కలిసి మరోసారి అయ్యప్పను దర్శించుకోవడానికి ఆమె వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో బిందుతోపాటు తృప్తి దేశాయ్‌ బృందాన్ని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి పోలీసులు తరలించారు. దీనిపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు ఎన్‌.వాసు స్పందించారు. తృప్తి దేశాయ్‌ రాకపై మాకు ఎలాంటి సమాచారం లేదని, ఈ అంశాన్ని పోలీసులు, ప్రభుత్వమే తేల్చుకుంటారన్నారు. సుప్రీంకోర్టు చివరి తీర్పులో స్పష్టత లోపించినట్లు మేము ఇంకా భావిస్తున్నామని అన్నారు. అయితే తృప్తి దేశాయ్‌ రాక నేపథ్యంలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని నిలక్కల్‌, పంబ బేస్‌ క్యాంపుల్లో పోలీసులు బలగాల్ని మోహరించారు.