శరవవేగంగా కాళేశ్వరం పనులు
కెసిఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు
జయశంకర్ భూపాలపల్లి,మార్చి29(జనంసాక్షి): కాళేశ్వరం ఎత్తిపోతలతో సహా మూడు ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, కెసిఆర్ తరచూ పర్యవేక్షించడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుఉత్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మించి 180 టీఎంసీల నీటిని మళ్లించడంతో పాటు 7,38,851 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా దీని లక్ష్యం. దీంతో పర్యావరణ అనుమతులకు సంబంధించి ముందడుగు పడింది. పునరాకృతిలో భాగంగా 20 టీఎంసీలతో చేపట్టిన ప్రాణహితకు కూడా ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు అనుమతి ఇచ్చేందుకు తిరస్కరించిన పర్యావరణ ప్రభావ మదింపు నిపుణుల కమిటీ అంగీకరించింది. కాళేశ్వరంతోపాటు ప్రాణహిత, తుపాకులగూడెంకు కూడా ఆమోదం తెలిపింది. దీనివల్ల పర్యావరణ ప్రభావంపై అధ్యయనం, పర్యావరణ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సమర్పించడానికి నీటిపారుదల శాఖకు ఆమోదం లభించింది. అంతర్‌రాష్ట్ర సరిహద్దు గల కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 302 హెక్టార్లు ముంపునకు గురవుతుంది. ఈ పథకానికి మొత్తం 32వేల హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 2,866 హెక్టార్లు అటవీభూమి. మొత్తం ముంపు 13,706 హెక్టార్లు. 1,832 కి.విూ. దూరం కాలువ వ్యవస్థను నిర్మించే ఈ పథకం అంచనా వ్యయం రూ.80,499 కోట్లుగా తేల్చారు.