శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొండిచేయేనా?

అయితే రెబల్‌గా బరిలోకి దిగే ఆలోచన

లేదా ఉత్తరాది పార్టీ టిక్కెట్‌పై నిలవాలని యోచన

మెదక్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో విజయశాంతి కారణంగా టిక్కెట్‌ దక్కని మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి మరోమారు ఎదురీదుతున్నారు. ఆయకు టిక్కెట్‌ దక్కేలా లేదన్న సమచాచాంతో ఇండిపెండెంట్‌గా పోటీలోకి దిగాలని చూస్తున్నారు. దీంతో మహా కూటమిలో అభ్యర్థుల ప్రకటనకు ముందే చీలిక వచ్చింది. మెదక్‌ సీటును టీజేఎస్‌కు కేటాయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 14న నామినేషన్‌ వేయనున్నట్టు ప్రకటించారు. పొత్తులో భాగంగా ప్రతిసారీ తన సీటుకే ఎసరు వస్తున్నదని శశిధర్‌రెడ్డి వాపోయారు. 2004లో కూడా తాను ఇండిపెండెంట్‌గా గెలుపొందిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను బరిలో ఉంటున్నట్టు ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా మెదక్‌ సీటును టీజేఎస్‌కు కేటాయించారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ న్యాయవాది జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కోదండరాం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే శశిధర్‌రెడ్డి కార్యకర్తలు, నాయకులతో సమావేశమై భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించడం చర్చనీయాంశమైంది. తనకు సీటు రాకుంటే ఒంటరి పోటీకి దిగడమా లేదా గతంలో లాగా సమాజ్‌వాదీ లేదా బిఎస్పీ టిక్కెట్‌పై గెలుపొందడమా అన్న ఆలోచనాలో ఉన్నారు. ఇదిలావుంటే విద్యారంగంలో మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శశిధర్‌ రెడ్డి అన్నారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విద్యార్థులకు ప్రతిబందకంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో గత నాలుగన్నరేళ్లుగా విద్యారంగంలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. సకాలంలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు. గురుకులా ఏర్పాటు మంచిదే అయినా దానిని చూపించి ఇదే కేజీ టు పీజీ విద్య అని అనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. విద్యారంగ విధానాలను, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబించడం సరికాదన్నారు. నల్లధనం వెలికి తీస్తామని చెబుతూ కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విధానమే పెద్ద లోపభూయిష్టమన్నారు. నగదు

రహిత లావాదేవీలు పెంచాలని చెబుతున్న ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై పన్ను వేయడం వల్ల ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వేలాది పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. మరుగుదొడ్లు ఉన్నా నీటి సరఫరా లేని పాఠశాలలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. కనీసం విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు లేని పాఠశాలలు , ప్రహరీ లేని పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రబడ్జెట్‌లో విద్యకు తగిన నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందుతుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం అనకొర నిధులు కేటాయించినా ఈ నిధులు సరిపోవని విద్యావేత్తలు చెప్తున్నారు. తన ప్రచారంలో ఈ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వీటి పరిష్కారానికి చొరవ చూపుతానని అన్నారు.