శాసనసభ ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధం కాదా..?

ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల
అమరావతి, జూన్‌15(జ‌నం సాక్షి ) : శాసనసభ కమిటీలన్నీ రాజ్యాంగబద్ధమని, శాసనసభ కమిటీల రిపోర్టులను రహస్యంగా ఉంచాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. వైసీపీ నేత, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి.. పేపర్లను అందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి యనమల విూడియాతో మాట్లాడుతూ శాసనసభ ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధం కాదా..? ప్రశ్నించారు. ఇదే నిజమైతే బుగ్గనపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఎందుకు పెట్టకూడదని మంత్రి అన్నారు. ప్రలోభాలతో ప్రశ్నలు అడిగిన ఉదంతం కన్నా ఇది పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిర్ధారించాల్సి ఉందని మంత్రి యనమల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన యనమల..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జెడ్పీ ప్రాంగణంలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆవిష్కరించారు. మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఎప్పుడు పేదల గురించి ఆలోచించేవారని, వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఎన్టీఆర్‌ బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం చేసిన ఘనత ఎన్టీఆర్‌ది అని మంత్రి చెప్పారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎన్టీఆర్‌ సినిమాల్లోనే కాక ప్రజల హీరోగా నిలబడ్డారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.