శివరాజ్‌ సింగ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

బస్సుయాత్రలో దుండగుల వీరంగం

సిఎం చౌహాన్‌కు తప్పిన ముప్పు

భోపాల్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బస్సు యాత్రలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు రాళ్లదాడి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిద్దా జిల్లా సవిూపంలోని చౌరాత్‌ ప్రాంతంలో పర్యటన చేపడుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ముఖ్యమంత్రికి ఎటువంటి గాయాలు కాలేదని చౌరాత్‌ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ చౌరాత్‌ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా రాళ్లదాడి జరిగిందని, ప్రతిపక్షనేత అజయ్‌సింగ్‌ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందని రాష్ట్ర బిజెపి ప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో చౌహాన్‌ మాట్లాడుతూ అజయ్‌సింగ్‌ను విూకు ధైర్యం ఉంటే బహిరంగంగా నాతో పోరాడండి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ రాళ్ల దాడికి తనకు ఎటువంటి సంబంధం లేదని, కాంగ్రెస్‌ పార్టీ హింస సంస్కృతిని అనుసరించదని అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తనను, తన నియోజకవర్గ ప్రజలను అపహాస్యం చేసేందుకు పన్నిన కుట్రగా భావిస్తున్నట్లు అజయ్‌ తెలిపారు. కాగా, జన ఆశీర్వాద్‌ యాత్ర పేరుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీవారే దీనికి బాధ్యలుని భావిస్తున్నారు. శివరాజ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఆందోళనకారులు చేసిన దాడిలో ఎవరూ గాయపడలేదు. సీఎం ప్రచార వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అజయ్‌ సింగ్‌ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.