శివాలయాల్లో భారీగా శివరాత్రి వేడుకలు
విజయవాడ,ఫిబ్రవరి16(జనంసాక్షి ): ఎపిలో పలు ఆలయాల్లో శివరాత్రి శోభ నెలకొంది. శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అన్ని దేవాలయాల్లోనూ మహా శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీశైలం మల్లిఖార్జున స్వామి,పాలకొల్లు, ద్రాక్షారామం, మహానంది, కాళహస్తి తదితర ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.భీమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. భీమేశ్వర సన్నిధిలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. సుమారు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్యూలైన్లను క్రమబద్దీకరించారు. ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచిన శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. పుష్పపల్లకిలో పార్వతీపరమేశ్వరులు ఊరేగారు. వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తన్మయత్వం పొందారు. సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిదంపతుల గ్రామోత్సవం పురవీధుల్లో కన్నులపండువగా సాగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. శివరాత్రిని వైభవోపేతంగా నిర్వహించేందుకు కృష్ణాతీరం ముస్తాబైంది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉత్తరవాహినీగా ప్రవహించే కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.