శీతల గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం

మంటలను అదుపుచేసి అగ్నిమాపక సిబ్బంది
ఘటన స్థలిని పరిశీలించిన మంత్రి పత్తిపాటి
గుర్తు తెలియని వ్యక్తులు తనను బంధించి నిప్పంటించారని పేర్కొన్న వాచ్‌మెన్‌
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుంటూరు, జూన్‌15(జ‌నం సాక్షి ) : గుంటూరు జిల్లాలో మరో శీతల గిడ్డంగి అగ్ని ప్రమాదానికి గురైంది. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో శీతల గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాములో కోట్ల విలువైన మిర్చి, శనగ, కంది నిల్వలున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున గోదాము పై భాగంలో మంటలు కనిపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉదయం నుంచి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.  గోదాములోని పై ఛాంబర్‌ మాత్రమే అగ్నిప్రమాదానికి గురైందని.. మిగిలిన ఛాంబర్‌లోకి మంటలు వ్యాపించకుండా నిరోధించగలిగామని ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి మురళీమోహన్‌ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో గోదాములో 16 వేల క్వింటాళ్లకు పైగా వివిధ రకాల పంట నిల్వలున్నాయి. 11983 క్వింటాళ్ల మిర్చి, 2450 క్వింటాళ్ల శనగలు, 897 క్వింటాళ్ల కందులు గోదాములో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంటలు ఇతర చాంబర్‌లోకి వ్యాపించక ముందే పంట నిల్వలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన శీతల గిడ్డంగిని మంత్రి పత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ప్రమాదం సంభవించిన తీరును అడిగి తెలుసుకున్నారు.ఇదిలా ఉంటే చిలకలూరిపేట శీతల గిడ్డంగి అగ్నిప్రమాదం కేసులో కొత్త కోణం కనిపిస్తోంది. నలుగురు అగంతకులు వచ్చి గిడ్డింగికి నిప్పు పెట్టారని వాచ్‌మెన్‌ చెబుతుండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత నలుగురు వ్యక్తులు కార్లో వచ్చి తనను బంధించి పెట్రోల్‌ పోసి గోదాముకు నిప్పంటించారని వాచ్‌మెన్‌ మహబూబ్‌ చెబుతున్నాడు. తనను బంధించారని వాచ్‌మెన్‌ చెబుతున్నప్పటికీ పోలీసులకు అలాంటి ఆధారాలు ఏవీ దొరకలేదు. క్లూస్‌ టీం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించింది. విచారణ తర్వాత ప్రమాదంపై నిర్ధారణకు వస్తామని పోలీసులు చెబుతున్నారు.