శేషాచలం పోలీసు కాల్పులపై తమిళనాడు సీఎం గుస్సా

1
న్యాయవిచారణకు డిమాండ్‌ చేస్తూ ఏపీ సీఎంకు పన్నీర్‌ లేఖ

చెన్నై,ఏప్రిల్‌7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళనాట నిరసనలు మిన్నంటాయి. దీంతో సిఎం పన్నీర్‌ సెల్వం అత్యవసర సమావేశంలో దీనిపై చర్చించారు.  మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్‌ చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు.స్మగ్లింగ్‌ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎన్‌ కౌంటర్‌ జరిగిన అటవీ ప్రాంతంలో ఏపీ డీజీపీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పలు తమిళ రాజకీయ పార్టీలు ఆంధ్రా ఆస్తులపై దాడి చేస్తామని హెచ్చరించాయి. తమిళ కూలీలెవ్వరూ ఆంధ్రప్రదేశ్‌ లోకి వెళ్లొద్దంటూ సరిహద్దు వద్ద తమిళనాడు అధికారులు చెక్‌ పోస్టులు ఏర్పాటుచేశారు. ఎర్ర చందనం స్మగ్లర్లన్న అనుమానంతో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్‌కౌంటర్‌ చేయడంపై తమిళనాడు భగ్గుమంది. పొట్టకూటికోసం కూలీ పని చేసుకునే వారిని కాల్చివేస్తారా? అంటూ చెన్నెలో నిరసనలు మిన్నంటాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తమిళర్‌ కచ్చి అనే సంస్థ హెచ్చరించింది. చెన్నైలోని ఆంధ్రా ఆస్తులు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు ¬టళ్లపై దాడి చేస్తామని ప్రకటించింది. దీంతో చెన్నై పోలీసులు అలర్టయ్యారు. ఆంధ్రా సంస్థలు, ఆస్తుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.