శైవాలయాల్లో ప్రత్యేక జాతర

నిజామాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ఆలయాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి. ప్రత్యేక అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. సిరికొండ నుంచి ఏడు కిలోవిూటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో  ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్ధశి మహాశివరాత్రి నుంచి మూడు రోజుల వరకు రామలింగేశ్వర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, అభిషేకాలు, భజనలు, రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఆహ్లాదం గొలిపే రమణీయ ప్రకృతి అందాల నడుమ రామలింగేశ్వరస్వామి వెలిశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17,18,19 తేదీల్లో జాతర జరుగుతుంది. 17న ప్రాతకాలమున అభిషేకం, రుద్రాభిషేకం, పల్లకీసేవ ఉంటుంది. 18న అన్నపూజలు, ప్రదోషపూజ, అభిషేకం చేస్తారు. 19న ప్రత్యేక పూజ అన్నపూజ, అభిషేకాలుంటాయి.

సుమారు 8 వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో పునరుద్ధరించారు. ఇలా చారిత్రక విశేషాలు ఉన్న ఆలయాలు ఎన్నో జిల్లాలో ఉన్నాయి. వీటిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.