శ్రమను ఎగతాళి చేస్తారా?

– అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరు
– అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష
– బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డా టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి, నవంబర్‌26  ( జనం సాక్షి )  : ప్రపంచంలోనే అద్భుత రాజధానిగా అమరావతిని నిలపాలనే ఉద్దేశంతో తాము రాజధాని నిర్మాణం చేపడితే.. వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిస్థాయిలో ఉన్న బొత్స అమరావతిని శ్మశానంతో పోల్చడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఈనెల 28న చంద్రబాబు అమరావతి పర్యటనకు రావడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా అంటూ బాబుపై మంత్రి ధ్వజమెత్తారు. అయితే బొత్స వ్యాఖ్యలపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా.. ఈ వ్యాఖ్యలపై
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా ఖండించారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అన్నారు. తెదేపా హయాంలో రూ.52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటక జన సందోహంతో నిత్య సందడిగా ఉండేదని, అటువంటి సజీవ స్రవంతి అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరన్నారు. కానీ మంత్రి బొత్సాగారు ప్రజారాజధానిని శ్మశానంతో పోల్చి 5కోట్ల ఆంధ్రులనే కాదు, శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా అవమానించారని చంద్రబాబు అన్నారు. అక్కడున్న విశ్వవిద్యాలయాలు విూకు స్మశానాలా ..? హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్‌ విూ కళ్లకు స్మశానాల్లా కనిపిస్తున్నాయా? రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా? నిర్మాణాల్లో చెమటోడ్చిన కూలీల శ్రమను ఎగతాళి చేస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే హక్కు లేదని, అమరావతి అభివృద్దిపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.