శ్రీకృష్ణ కమిటీ తెలంగాణవాదులు ఇచ్చిన సమాచారాన్ని పొందుపర్చలేదు
8వ చాప్టర్ ఎందుకు ఇచ్చారో శ్రీకృష్ణా సెలవిస్తారా ?
కోదండరాం సూటి ప్రశ్న
హైదరాబాద్, అక్టోబర్ 5 (జనంసాక్షి) :
తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్ శ్రీ కృష్ణ తన నివేదికలో పొందుపర్చలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కొద్ది సమాచారాన్ని ఇచ్చినా పట్టించుకోక పోవడం వల్లనే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏ పరిష్కారాన్ని కూడా చూపలేక పోయిందని ఆయన విమర్శించారు. హైదరబాద్‌లో శుక్రవారం కోదండరాం తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసినందుకు తెలంగాణ నగారా అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నివేదికలో 8వ అధ్యాయాన్ని ఎందుకు రాశారో స్పష్టం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. తాను సమర్పించిన అబద్ధాల నివేదిక శ్రీ కృష్ణ ఇంకా సమర్థించుకోవడం శోచనీయమని మండిపడ్డారు. జస్టిస్ శ్రీ కృష్ణ తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపర్చి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జాప్యం కావడానికి ప్రత్యక్షంగా కారణమైనందున, ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ఆకాంక్షలను ప్రతిభంభించిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.