శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె పర్యటనపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద వైగో అరెస్టు
న్యూఢిల్లీ/తిరుపతి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే భారత పర్యటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే వెంటనే భారత్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తమిళ సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా రోడ్డెక్కాయి. ఢిల్లీ, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాల్లో తమిళులు ఆందోళనలు నిర్వహించారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌ నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. రాజపక్సే పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎండీఎంకే నేత వైగొ నిరసన చేపట్టారు. శుక్రవారం భారత్‌లో అడుగు పెట్టిన రాజపక్సే రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శనంతో పాటు బీహార్‌లోని బోధగయాను రాజపక్సే సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటనలో ఆయన భారత అధికారులెవరినీ కలవడం లేదు. ఆయన వ్యక్తిగత ¬దాలోనే
తిరుమల, బోధగయాలలో పర్యటిస్తున్నారని రాజపక్సే కార్యాలయం తెలిపింది.
తిరుపతిలో ఆందోళన.. భారీ భద్రత
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుమల పర్యటన నేపథ్యంలో అడ్డుకునేందుకు తమిళులు భారీ సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. రాజపక్సేకు వ్యతిరేకంగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఉదయం తమిళ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. తమిళుల ఊచకోతకు పాల్పడిన రాజపక్సే ఈ మట్టిపై అడుగు పెట్టడానికి వీలులేదని మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడి పర్యటనను అడ్డుకునేందుకు తమిళనాడు నుంచి వాహనాల్లో తిరుపతికి వస్తున్న పలువురు తమిళులను చిత్తూరులో పోలీసులు అడ్డుకున్నారు. రాజపక్సే పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతను ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలా మంది తమిళులు తిరుపతి చేరుకున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఐబీ వర్గాలు హెచ్చరించాయి. ఈనేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వెళ్లే మార్గంలో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. రాజపక్సే తన కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. నేరుగా తిరుమలకు వెళ్లి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. శనివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని బీహార్‌లోని బుద్ధగయాకు వెళ్తారు.