శ్రీలంక కెప్టెన్‌గా లక్మల్‌

– ప్రకటించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు
– బాల్‌ టాంపరింగ్‌తో నిషేదానికి గురైన చండిమాల్‌
బార్బడోస్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : బాల్‌ టాంపరింగ్‌కి పాల్పడి నిషేధానికి గురైన శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ స్థానంలో సురంగ లక్మల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు శనివారం కెప్టెన్సీ మార్పుపై ఒక ప్రకటన విడుదల చేసింది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో చండిమాల్‌ బాల్‌ టాంపరింగ్‌కి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం విధించింది. దీంతో.. వెస్టిండీస్‌తో శనివారం నుంచి జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కి చండిమాల్‌ దూరమయ్యాడు.’దినేశ్‌ చండిమాల్‌ జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో లక్మల్‌ని శ్రీలంక కెప్టెన్‌గా నియమించామని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందులో చండిమాల్‌ బాల్‌ టాంపరింగ్‌, ఐసీసీ బ్యాన్‌ అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఒక టెస్టు నిషేధం, మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత, రెండు డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడంపై రెండు రోజుల క్రితం చండిమాల్‌ ఐసీసీకి అప్పీల్‌ చేసుకున్నాడు. కానీ.. చూయింగ్‌గమ్‌ లాంటి పదార్థాన్ని నమిలి ఆ తర్వాత ఉమ్మితో బంతిని చండిమాల్‌ శుభ్రం చేసిన వీడియోలు సాక్ష్యాలుగా ఉండటంతో అతని అప్పీల్‌ని ఐసీసీ తిరస్కరించింది. దీంతో.. చండిమాల్‌కి శిక్ష తప్పలేదు. మొదటి టెస్టులో వెస్టిండీస్‌ 226 పరుగుల తేడాతో గెలవగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది.