శ్రీవారికి పెరుగుతున్న విరాళాలు

తిరుమల,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తిరుమలలో వివిధ సేవలకు విరాళాలు భారీగా వస్తున్నాయి. సేవలను పెంచాలన్న భావన భక్తుల్లో పెరుగుతోంది. తిరుపతికి చెందిన వ్యాపారవేత్త కె.భాస్కర్‌రావు తన కుమారుడు త్రిలోక్‌తో కలిసి ఇటీవల ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు డిడిని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి దాతలు అందజేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం చేయడం ఎంతో ఉత్తమమైనదని టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. అన్నదానం మహాదానమని, టిటిడి అన్నప్రసాద విభాగం కొన్ని దశాబ్దాలుగా భక్తులకు విశిష్టమైన సేవలు అందిస్తోందని కొనియాడారు. ప్రతిరోజూ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు వస్తున్నాయని, ప్రస్తుతం రూ.1,350 కోట్ల మొత్తం ఉందని వెల్లడించారు. గత ఏడాది రూ.141 కోట్ల విరాళాలు వచ్చాయని, వడ్డీ రూపంలో రూ.79 కోట్లు అందిందని తెలిపారు. గత ఏడాది అన్నప్రసాదాల వితరణకు అయిన ఖర్చు రూ.99.90 కోట్లు అని తెలియజేశారు. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో అన్నప్రసాదం ట్రస్టు స్వయం ప్రతిపత్తి సాధిస్తుందన్నారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో దాదాపు లక్ష మంది, రద్దీ రోజుల్లో లక్షా 50 వేల మంది వరకు భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని ఈవో తెలిపారు. అన్నప్రసాదాల తయారీకి రోజుకు 6 నుండి 7 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నామని, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో గత రెండు నెలల్లో 55 టన్నుల బియ్యం విరాళంగా అందిందని వివరించారు. గరుడసేవ, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి లాంటి విశేషమైన రోజుల్లో పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు అన్నప్రసాదం సిబ్బంది, శ్రీవారి సేవకులు విశేషంగా సేవలందిస్తున్నారని అభినందించారు.