శ్రీవారి ఆభరణాలు ..
బహిరంగ ప్రదర్శన చేసేందుకు వీలులేదు
– టీటీడీ ఆగమ సలహాదారు భట్టాచార్యులు
తిరుమల, జూన్26(జనం సాక్షి) : శ్రీవారి ఆభరణాలను బహిరంగంగా ప్రదర్శించేందుకు వీలులేదని, ఇందుకు ఆగమాలు ఒప్పుకోవని టీటీడీ ఆగమ సలహాదారుడు సుందరవదన భట్టాచార్యులు అన్నారు. మంగళవారం ఆయన ఓ విూడియా ఛానెల్‌తో మాట్లాడారు. స్వామివారి ఆభరణాలు రమణ దీక్షితుల సమక్షంలోనే ఉండేవని, ఇన్నేళ్లుగా చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో రమణ దీక్షితులకే తెలియాలని ఆయన అన్నారు. శ్రీవారి నగలు భద్రంగా ఉన్నాయని అన్నారు. రమణ దీక్షితులు పనిచేసిన కాలంలో ఆయన సమక్షంలోనే నగలు ఉండేవని, ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా అవే నగలు ఉన్నాయని తెలిపారు. శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో వస్తున్న అపోహలన్నీ ఎవరూ నమ్మవద్దని, ఆభరణాలన్నీ చాలా భద్రంగా ఉన్నాయని సుందరవదన భట్టాచార్యులు పేర్కొన్నారు. అయితే స్వామివారి ఆభరణాలు భక్తులకు ప్రదర్శించాలని అనుకుంటున్న టీటీడీ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నాని ఆయన అన్నారు. శ్రీవారి ఆభరణాలన్నీ బంగారు వాకిలి లోపలే ఉండాలని, అప్పుడే అవి భద్రంగా ఉంటాయని భట్టాచార్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.